హైదరాబాద్,నవంబర్26(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా నగదుకష్టాలు మరింతరెట్టింపు అయ్యాయి. శుక్రవారం కార్తీక పౌర్ణమి సెలవుతో పాటు నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు దినం కావడం, ఆదివారం సెలవు కావడంతో నోట్ల కోసం ఇబ్బందులు పెరిగాయి. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో కరెన్సీ కష్టాలు మరింత పెరిగాయి. శుక్రవారానికే జిల్లాల్లోని బ్యాంకుల్లో నగదు చాలా వరకు తగ్గిపోయింది. ఏటీఎంలలో కూడా నగదు లేదు. ఏటీఎంలన్నీ చాలా వరకు ఖాళీ అయ్యాయి. వీటిలో నగదు ఉంచాలంటే బ్యాంకులు పనిచేయాలి. సెలవుల్లో అధికారులు ఉండరు. ఇటు బ్యాంకులు పనిచేయక, అటు ఏటీఎంలలో నగదు లేక ప్రజలు మరిన్ని కష్టాలు ఎదుర్కోక తప్పలేదు. ఏటీఎంలలో ఉంచటానికి కనీసం రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. చిల్లర లేక, నగదు రాక మూడు రోజులు గడపటం ఎలా అని ప్రజలు తలపట్టుకుంటున్నారు. ఇదిలావుంటే పలుజిల్లాల్లోని కొన్ని ఖాతాల్లో నగదు అక్రమంగా జమ అవుతున్న దానిపై ఆదాయ పన్ను శాఖ కన్నేసినట్లు సమాచారం. ఎన్నికల సమయం కావడంతో లావాదేవీలపై కన్నేసారు. కొన్ని బ్యాంకుల్లోని ఖాతాల్లోకి నల్లధనం జమ అవుతున్నట్లు సమాచారం ఉండటంతో అధికారులు వీటిపై దృష్టి పెట్టారు.





