తిరుపతిలా స్వయం
ప్రాతిపత్తిగల సంస్థ
ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్, నవంబర్ 17 (జనంసాక్షి) : యాదగిరి గుట్టను వాటికన్సిటీగా మారుస్తానని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. తిరుపతిలా స్వయం ప్రాతిపత్తిగల సంస్థను ఏర్పాటుచేస్తామని చెప్పారు. యాదగిరిగుట్ట అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడానికి, అమలుచేయడానికి కార్యక్రమాల పర్యవేక్షనాధికారిగా శిల్పాలరామం స్పెషల్ ఆఫీసర్ జి.కిషన్‌రావును నియమించారు. సచివాలయంలో సోమవారం సీఎం యాదగిరిగుట్ట అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు బివి.పాపారావు, శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ జి.కిషన్‌రావు, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.నర్సింగరావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్టపై ప్రస్తుతం ఉన్న గోపురం కన్నా ఇతర కట్టడాలే ఎత్తుగా కనిపిస్తున్నాయని అన్నారు. వాటిని తొలగించి గోపురం మొత్తం స్పష్టంగా కనిపించే విధంగా ఇతర నిర్మాణాలు చేపడుతామన్నారు. గోపురాన్ని స్వర్ణ తాపడంతో చేస్తామన్నారు. మొత్తం యాదగిరిగుట్ట ప్రాంతంలో రెండువేల ఎకరాలు సేకరించి కళ్యాణమండపాలు, వేదపాఠశాల, సంస్కృత పాఠశాల నిర్మించాలన్నారు. యాదగిరి నరసింహస్వామి అభయారణ్యాన్ని కూడా అభివృద్ధి చేస్తామన్నారు. గుట్టపైన కూడా సుగంధం వెదజల్లే వృక్షాలు, లాన్లు, ల్యాండ్ స్కేపింగ్ చేయాలని సూచించారు. యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి కటాక్షం కోసం దీక్షలు చేస్తూ అక్కడే కొద్దిరోజులు ఉండే మానసిక వ్యాధిగ్రస్తులు, ఇతర మొక్కులు మొక్కుకున్న వాళ్ళ కోసం ప్రత్యేక బహుళ అంతస్తుల భవనాలు నిర్మించాలని చెప్పారు. యాదగిరి గుట్ట క్షేత్ర పాలకుడైన హనుమంతుడిని కూడా ప్రత్యేకంగా కొలుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలోనే అతిపెద్దదైన హనుమంతుడి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్టించనున్నట్లు వెల్లడించారు. గుట్టపైనున్న ప్రధాన ప్రదేశాలకు ఆధ్యాత్మిక పేర్లను పెడతామన్నారు. యాదగిరి ప్రధాన గుట్టలతో పాటు చుట్టుపక్కల ఉన్న చిన్నచిన్న గుట్టలు, రాయిగిరి, గంధమల్ల చెరువులను కూడా పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఔటర్ రింగురోడ్డు అవతలి ప్రాంతంలో నిర్మించతలపెట్టిన రీజినల్ రింగురోడ్డును యాదగిరిట్ట మీదుగా తీసుకెళతామని చెప్పారు. యాదగిరిగుట్ట పవిత్రతను, ప్రాముఖ్యతను కాపాడటానికి అక్కడ ఇతర ప్రైవేటు కట్టడాల నియంత్రణ పెట్టనున్నట్లు వెల్లడించారు.




