Tuesday, 3 November 2026

పెరగనున్న ప్రజాప్రతినిధుల జీతాలు

 

Untitled-7

హైదరాబాద్‌, నవంబర్‌ 17 (జనంసాక్షి) : ప్రజాప్రతినిధుల జీతభత్యాలు పెరగనున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జీతభత్యాలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అలాగే, మంత్రుల జీతాలు రెట్టింపు చేసే అంశంతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛన్లను కూడా పెంచాలని భావిస్తోంది. పార్లమెంట్‌ సభ్యులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అలవెన్స్‌లను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం కూడా తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆమోదం తర్వాత సంబంధిత ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం పెంచాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు గతంలోనే నిర్నయం తీసుకున్నారు. వేతనం, అన్ని రకాల భత్యాలు కలుపుకొని ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.95 వేల చొప్పున వేతనం వస్తోంది. అది సరిపోవడం లేదని, దాన్ని రెట్టింపు చేయాలని చాలాకాలంగా శాసనసభ, మండలి సభ్యులు కోరుతున్నారు. దీనిపై గతంలో ఒకసారి సవిూక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. తాజాగా మరోమారు దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతభత్యాలను రెట్టింపు చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే దస్త్రం సిద్ధమైంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వస్తున్న రూ.95 వేల జీతభత్యాలను రూ.2 లక్షల వరకు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సంబంధిత దస్త్రం ముఖ్యమంత్రి వద్దకు చేరిందని పేర్కొన్నాయి. దీనిపై రెండు మూడు రోజుల్లో సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపాయి. అలాగే, మంత్రుల జీతాలను రెట్టింపు చేయనున్నట్లు వెల్లడించాయి. ఎంపీలకు రాష్ట్రం తరఫు నుంచి అలవెన్స్‌ కూడా పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వారితోపాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా పింఛన్లు పెంచాలని కేసీఆర్‌ యోచిస్తున్నట్లు సమాచారం. జీతభత్యాలు, పింఛన్ల పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఐదేళ్లలో సుమారు రూ.150 కోట్ల మేర భారం పడనుందని అంచనా. అయినప్పటికీ ప్రభుత్వం జీతభత్యాలు పెంచాలన్న ఉద్దేశ్యంతోనే ఉందని అధికార వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *