వాతావరణ కాలుష్యంపై ఇంత నిర్లక్ష్యమా?
ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవాలు జరుపుకుంటున్నా ప్రజల్లో మాత్రం మార్పు కానరావడం లేదు. ఎక్కడిక్కడ కాలుష్యం పెరిగే చర్యలను ప్రోతస్హిస్తున్నాం. మనం అనారోగ్యం పాలు కావడమే గాకుండ ఆపక్కవారి ప్రాణాలకు కారణం అవుతున్నాం. క్యాన్సర్ తదితర రోగాల విస్తృతి పెరిగినా, కారణాలు తెలిసినా ఎందుకనో మేల్కోవడం లేదు. మానవ తప్పిదాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గి, శీతగాలులు మొదల య్యేసరికి మన నగరాల్లోని కాలుష్య భూతం మరింత ఉగ్రరూపం దాలుస్తుంది. దట్టంగా వ్యాపించే పొగమంచులో దుమ్మూ, ధూళి కణాలతోపాటు కాలుష్యకారక ఉద్గారాలు కలగలిసి జనం ఊపిరితిత్తుల్లోకి చొరబడుతున్నాయి. కొంచెం కొంచెంగా ప్రాణాలను పీల్చేస్తుంటాయి. ప్లాస్టిక్ వాడకాలు పెరగడంతో కాలుష్య భూతం మరింతగా కమ్ముకొస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమస్యలను ప్రజల్లో చైతన్యం తో మార్చలేమని ప్రభుత్వాలు గుర్తించడం లేదు. ఈ దేశంలో కఠిన చట్టాలకే భయపడని పరిస్థితులు ఉన్నాయి. కఠిన చట్టాలను అమలు చేసేవిధంగా కాలుష్యం విసయంలో మరనింత కఠినంగా వ్యవహరిం చాల్సి ఉంది. ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలి. మైక్రాన్ల లెక్కలతో వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం మానాలి. కాలుష్య కారక కారణాలపై చైతన్యంతో పాటు కఠిన చర్యలకు పూనుకోవాలి. నిరంతరం మొక్కలు పెంచే కార్యక్రమం కొనసాగించాలి. ప్రభుత్వం చేపట్టిన హరితహారం నిరంతరంగా సాగేలా చూడాలి. ప్రజలు కూడా బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించే పరిస్థితులు రావాలి. ఇప్పటికే అనేకానేక కాలుష్య కార్యక చర్యల కారణంగా వాతావరణ మార్పులు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాలుష్యం మోతాదు మించి ఇటీవల ఢిల్లీ అతాకుతలం అయ్యింది. అమెరికాలో మంచు తుఫాన్లు కలవరం కలిగిస్తున్నాయి. చలిగాలుల తీవ్రత కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయి. ఇలా విపరీత పరిణామాలు సంభవించడానికి మానవాళి తప్పిదాలే అని గుర్తించాలి. . వాతావరణ కాలుష్యంతో భారత్ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్నా పట్టించుకోవడం లేదు. పర్యావరణాన్ని పూర్తిగా దెబ్బతీసే పనులను పూనుకుంటోంది. భారత్ లాంటి దేశాల్లో ప్రజలపై అజమాయిషీ లేకపోవడం, వారిలో నైతికి బాధ్యత లేకపోవడంతో మనదేశం ఓ డంపింగ్ యార్డ్‌గా మారుతోంది. దీనిని నివారించే చర్యలు కఠినంగా ఉండాల్సిందే. విపరీతమైన రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి సారం తగ్గి పంటలు చేవలేకుండా పండుతన్నాయి. అవన్నీ క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయి. అయినా పురుగులు, ఎరువుల మందులు లేకుండా పంటలు పండించడం లేదు. దీనిని చెక్ పెట్టేలా ప్రబుత్వం తోణం సేంద్రియం వైపు మొగ్గు చూపాలి. రైతులను చైతన్యం చేయాలి. అభివృద్ధి పేరిట సమస్త పరిశ్రమలు నగరం చుట్టూరా విస్తరించడంతోనే ఈ సంక్షోభం పుడుతోంది. పరిశ్రమలు, భారీ వాణిజ్య సముదాయాలు, సాఫ్ట్వేర్ పరిశ్రమలు, అనేకానేక ప్రభుత్వ కార్యాలయాలూ నగరాల్లోనూ, వాటి చుట్టుపట్లా ఉండటం వల్ల అక్కడ జనాభా కేంద్రీకరణ తప్పడం లేదు. అటు పల్లెసీమల్లో ఉపాధి అవకాశాలు తగ్గి వారంతా నగరాలకు వలస రావలసివస్తోంది. ఇలాంటివారందరికీ అవసరమైన ప్రజా రవాణా వ్యవస్థను నిర్వహించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. రాని బస్సుల కోసం గంటల తరబడి రోడ్లపై వేచి చూడటం కంటే అప్పో సప్పో చేసి సొంతంగా వాహనం సమకూర్చుకుంటే సమస్య తీరిపోతుందన్న ధోరణి పౌరుల్లో పెరుగుతోంది. పరిశ్రమలు వదిలే కాలుష్యం చాలదన్నట్టు అదనంగా ఈ వాహనాలు వదిలే ఉద్గారాలు వాతావరణంలో కేన్సర్ కారక కార్సినోజిన్‌ల వ్యాప్తికి కారణ మవుతున్నాయి. హైదరాబాద్ మొదలుకొని దేశ రాజధాని న్యూఢిల్లీ వరకూ ఇదే స్థితి నెలకొంది. పరిశ్రమలనుంచి, వాహనాలనుంచి వెలువడే కాలుష్యం తోడై నగరాల్లో ప్రమాద తీవ్రత హెచ్చుతుంది. ఏటికేడాదీ కాలుష్యం పెరుగుతోంది.
నగరాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. మొక్కుబడిగా వాహనాల నియంత్రణ అమలు చేయడం కాక… వాటి అమ్మకాలను సైతం నియంత్రించడం, ప్రజా రవాణా వ్యవస్థను పటిష్ట పరచడం, పరిశ్రమలు కాలుష్య నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాయో లేదో నిఘా పెట్టడంలాంటి చర్యలకు ఉపక్రమిస్తే కాలుష్యం దానంతటదే సర్దుకుంటుంది. కావలసినందల్లా దృఢ సంకల్పం… చిత్తశుద్ధి. ఆ రెండూ పాలకులకు కలగనంత కాలమూ కాలుష్యమూ, అందువల్ల కలిగే అనర్థమూ ఈ మాదిరే కొనసాగుతాయి. నానాటికీ ఉగ్రరూపం దాలుస్తాయి. సాధారణ సమయాల్లో కాలుష్యం గురించి పట్టనట్టుండే ప్రభుత్వాలు ముప్పు ముంచుకొచ్చాక ఏవో దిద్దుబాటు చర్యలు తీసుకోవడం తప్ప శాశ్వత చర్యలు కఠినంగా చేపట్టడం లేదు. కాలం గడుస్తున్నకొద్దీ అది పెరుగుతూ పోతుందే తప్ప తగ్గడం లేదు. ఈసారి పరిస్థితి మరింతగా దిగజారుతున్నట్టు కనబడుతోంది. గ్రామాలు మొదలు పట్టణాల్లో సైతం ఈ దుస్థితి తప్పడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వంటి అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న హెచ్చరికలు సైతం ప్రభుత్వాల చెవులకు సోకడం లేదు. ప్రభుత్వాలకు ముందు చూపు కొరవడి చేస్తున్న నిర్ణయాలే సమస్యను ఉన్నకొద్దీ పెంచుతున్నాయి. దేశంలో ఏ నగరం, పట్టణం చరిత్ర చూసినా ఇదే పరిస్థితి. కాలుష్యమయమైన నగరాలు, పట్టణాలతో పోలిస్తే అవి కాస్త మెరుగ్గా ఉండొచ్చుగానీ పూర్తి సురక్షితమైనవని నిర్ధారించలేం. నిజానికి ప్రభుత్వాలు తల్చుకుంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకకపోదు. విద్యా సంస్థలకు సెలవు లివ్వడం, వాహనాల నియంత్రణ, నిత్యావ సర సరుకులు తీసుకొచ్చే వాహనాలకు తప్ప ఇతర భారీ వాహనాలకు నగరంలో అనుమతి నిరాకరించడం వంటి నిర్ణయాలు సమస్యను పరిష్కరించలేవు. కనుక సమస్య యధాతథంగా ఉండిపోతుంది. ప్రభుత్వ యంత్రాంగాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి కూడా కాలుష్యానికి దోహదపడుతోంది. అంతర్జాతీయ నివేదిక వెల్లడించిన ప్రకారం కాలుష్యం పెరగడం వల్ల నెలలు నిండకుండానే పుట్టే పిల్లల సంఖ్య పెరుగుతున్నదని హెచ్చరించింది. కానీ ఎప్పటిలా నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది