నైరుతి ప్రవేశించినా తగ్గని ఎండల తీవ్రత
ఆందోళనలో ప్రజలు..పెరుగుతున్న కరెంట్ వినియోగం
హైదరాబాద్,జూన్22(జనం సాక్షి ): కాలం కాని కాలం దాపురించింది. రుతుపవనాలు ప్రవేశించి పక్షం రోజులు దాటినా ఇంకా ఎండలు మళ్లీ దంచికొడుతున్నాయి. నాలుగు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. వేడిగాలులతో జనం విలవిలలాడుతున్నారు. సాయంత్రం వేళలోఅక్కడక్కడా చిరుజల్లులు పడినా ఆ తర్వాత భరించలేని ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో కరెంట్ వినియోగం కూడా పెరుగుతోంది. ఎసిలు లేందే పట్టణ ప్రజలు ఉండలేకపోతున్నారు. ఆంద్రాలో పరిస్థితి మరింద దారుణంగా ఉండడంతో స్కూళ్లకు సెలవులు పొడిగించారు. అక్కడ మధ్యాహ్నం వేళలో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. కొద్ది రోజుల క్రితం జిల్లాలో తొలకరి వర్షానికి విత్తిన పత్తి గింజలు మొలకెత్తాయి. ఆ తర్వాత ఆశించిన మేర వానలు లేకపోవడంతో పత్తి మొలకలు వాడిపోతున్నాయి. జూన్ రెండు లేదా మూడో వారంలో వర్షాలు కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు వరణుడు కరుణించలేదు. జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాల ఆగమనం, తొలకరి వర్షంతో కొందరు రైతులు విత్తనాలు నాటుకున్నారు. ఆ తర్వాత నుంచి వర్షం లేకపోవడంతో పాటు ఎండలు దంచికొడుతుండటంతో మొలకెత్తిన మొక్కలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో విత్తనాలు నాటుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కలు కాపాడుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులు బిందెలు, బాటిళ్లలో నీళ్లు తీసుకొచ్చి మొక్క మొక్కకూ పోసి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. వర్షాకాలం ప్రవేశించినప్పటికీ ఎండకాలం తలపిస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తొలకరి జల్లులకు రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నప్పటికీ ఎండల తీవ్రత ధాటికి చేన్లు పొడిబారి పోయాయి. మళ్లీ వర్షం పడితే కానీ దున్ని విత్తనాలు నాటుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎండల తీవ్రతకు జనం ఉక్కపోతతో ఆగమాగం అవుతున్నారు. అప్పుడప్పుడు వాతావరణంలో మార్పు చోటుచేసుకుని చల్లబడుతున్నప్పటికీ రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటున్నాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో వర్షాలు కురుస్తాయని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. పూర్తిస్థాయి వర్షాలు పడే వరకు రైతులు తొందర పడకుండా విత్తనాలు నాటొద్దని సూచించారు. అయినప్పటికీ కొన్నిచోట్ల రైతులు విత్తనాలు నాటుకున్నారు. ఈ నెల మొదటి వారంలో వర్షం కురిసిన తర్వాత మరో మూడు సార్లు వరణుడు కరుణ చూపినప్పటికీ రైతాంగం ఆశించిన మేర వానలు పడలేదు. దీంతో పంటలు వేసిన రైతులు వాటర్క్యాన్లు, డ్రమ్ములు, బిందెల ద్వారా నీళ్లు తీసుకొచ్చి మొక్కలకు పోస్తున్నారు. కోస్తా జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతూనే ఉంది. శుక్రవారం కూడా ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2, 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. అక్కడక్కడ 39-41డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో కలిపి వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందని వెల్లడించారు. ఇది సముద్రమట్టానికి 2.1 కిలోవిూటర్ల నుంచి 4.5 కి.విూ ఎత్తులో ఉందని తెలిపారు. ఇప్పటివరకు బలహీనంగా ఉన్న నైరుతి రుతుపవనాలు.. బలపడే అవకాశం కనిపిస్తోందని చెప్పారు. ఈ ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల శుక్రవారం ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు ఉంటాయని చెప్పారు. ఆ తర్వాత 3 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.




