రాష్ట్రం నీటిపారుదల రంగ సలహాదారులు ఆర్ విద్యాసాగర్ రావు కన్నుమూశారు. చాలా రోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన.. చికిత్స కోసం హైదరాబాద్ కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరారు. ఈ రోజు (ఏప్రిల్ 29) ఉదయం 11 గంటల 23 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లు ఆస్పత్రి ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన చాలా కీలక బాధ్యతలు నిర్వహించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ల చీఫ్ ఇంజినీరీ గా సేవలు అందించారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుల రంగానికి అవసరమైన సలహాలు సూచనలు అందించేందుకు అడ్వయిజర్ గా ఉన్నారు.
విద్యాసాగర్ రావు సొంతూరు ఉమ్మడి నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెం. ప్రస్తుతం ఈ ఊరు యాదాద్రి జిల్లాలోకి వెళ్లింది. 1939 నవంబర్ 14న జన్మించారు. 1960లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేశారు విద్యాసాగర్ రావు. 1979లో రూర్కీ యూనివర్సిటీ నుంచి వాటర్ రీసోర్స్ డవలప్ మెంట్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. 1983న USAలో ఉన్న కొలరాడో యూనివర్సిటీ నుంచి వాటర్ రిసోర్స్ సిస్టమ్స్ పై డిప్లొమా చేశారు. 1990లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రం పట్టా అందుకున్నారు.
సెంట్రల్ వాటర్ కిషన్ లో ఇంజినీర్ గా కెరీర్ ప్రారంభించిన విద్యాసాగర్ రావు.. వివిధ రాష్ట్రాల్లో పని చేశారు. చీఫ్ ఇంజినీర్ స్థాయిలో రిటైర్ అయ్యారు. మనదేశం తరఫున ప్రపంచ దేశాల్లో పర్యటించి, అక్కడి నీటిపారుదల రంగంపై అధ్యయనం చేశారు. వాటిని ఇక్కడి అమలు చేసి.. బీడు భూములకు నీళ్లు పారించారు. మంచి మనిషిగా పేరుతెచ్చుకున్నారు. ఇండియన్ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు, ఇరిగేషన్ మేనేజ్ మెంట్ బోర్డుల్లో జీవితకాల సభ్యునిగా ఉన్నారు.
ఇక నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయంపై పోరాడుతూ మొదలైన తెలంగాణ ఉద్యమంలో నీటి పారుదల రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తన గళం గట్టిగా వినిపించారు విద్యాసాగర్ రావు. అన్ని దినపత్రికల్లో నీటిపారుదల విషయాలపై వందలకు వందలు స్టోరీలు రాశారు. నీళ్లు-నిజాలు పేరుతోని ఆయన రాసిన వ్యాసాలు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. నీటిపారుదల రంగ నిపుణులుగా.. ప్రాజెక్టులు ఎలా కట్టాలి.. ఎలా కడితే తెలంగాణకు లాభం, సమైక్య పాలకులు ఎలా మోసం చేసింది.. తన మాటలతో జనాలకు వివరంగా చెప్పటంలో.. ఆయనకు ఆయనే సాటిగా పేరుతెచ్చుకున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంలో విద్యాసాగర్ రావు చెప్పిన మాటలు కూడా స్ఫూర్తి నింపాయి. ప్రొఫెసర్ జయశంకర్ తో కలిసి.. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశారు విద్యాసాగర్ రావు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నారు విద్యాసాగర్ రావు. ఇరిగేషన్ రంగంలో ఆయనకున్న అనుభవంతో సర్కార్ కు సూచనలు చేస్తున్నారు. పూడిపోతున్న చెరువులు బాగుచేయాలన్న సర్కార్ సంకల్పంలో ఈయన పాత్ర కూడా ఉన్నది. ఇరిగేషన్ రంగంలో విద్యాసాగర్ రావుకున్న అనుభవం, ఆయన ఆలోచనలు మెచ్చుకుంటూ.. 2014లో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ సంస్థ లీడింగ్ ఇంజినీరింగ్ పర్సనాలిటీగా గుర్తించి అవార్డు కూడా ఇచ్చింది
కొంతకాలం నుంచి ఊపిరితిత్తుల వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు విద్యాసాగర్ రావు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన.. తుదిశ్వాస విడిచారు.




