విద్యుత్‌షాక్‌కుగురైన విద్యార్థులను పరామర్శించిన చంద్రబాబు

 అండగా ఉంటానని హావిూ
గుంటూరు, జూన్‌13(జ‌నం సాక్షి) : ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో విద్యుత్‌షాక్‌ తగిలి తీవ్రంగా గాయపడి కోలుకున్న ముగ్గురు విద్యార్థులు బుధవారం ఉధయం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు అండగా ఉంటామని సీఎం హావిూ ఇచ్చారు. తాడికొండ మండలం గరికపాడుకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో పార్టీ జెండా కడుతుండగా విద్యుత్‌షాక్‌కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన వారిని రమేష్‌ ఆస్పత్రికి తరలించి పార్టీ ఖర్చుతో వైద్యం అందించారు. కాగా చికిత్సలో భాగంగా విద్యార్థులు కాలు, చేతులు కోల్పోయారు. కోలుకున్న అనంతరం బుధవారం ఉదయం సీఎం చంద్రబాబును విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు కలుసుకున్నారు. వారితో మాట్లాడిన సీఎం అన్ని విధాలుగా ఆదుకుంటామని హావిూ ఇచ్చారు. అంతేకాకుండా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా సీఎం పేషీ అధికారులను ఆదేశించారు. సీఎం సాయంపై విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.