విద్యుత్‌ శాఖలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై క్రమబద్ధీకరణకు మార్గం సుగమం

వ్యతిరేకంగా దాఖలయిన పిటిషన్‌ కొట్టివేత

ముఖ్యమంత్రి కెసిఆర్‌ హర్షం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్ల సర్వీస్‌ క్రమబద్ధీకరణకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని గతంలో సిఎం కెసిఆర్‌ అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో 23వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ నాలుగు విద్యుత్‌ సంస్థలు గత ఏడాది ఆదేశాలు జారీ చేశాయి. విద్యుత్‌ శాఖలోని జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పిడిసిఎల్‌, ఎన్‌పిడిసిఎల్‌లలో పని చేసే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది.హైకోర్టు నిర్ణయంపై సిఎం కెసిఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సంస్థల్లో పని చేస్తున్న 23వేల మంది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మంగళవారం పండుగ రోజు అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రాన్స్‌కో సిఎండి ప్రభాకర్‌రావును అభినందించారు. 23 వేల మంది ఉద్యోగుల సర్వీస్‌ను క్రమబద్ధీకరించి వేతన సవరణ అమలు చేయాలని ఆయన విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. ఇదిలావుంటే ఆర్టిజన్ల పై వేసిన పిటిషన్‌ ను హైకోర్టు కొట్టివేయడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం

వ్యక్తం చేశారు. ఆర్జిజన్లను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం ఎంతో మానవీయతతో నిర్ణయం తీసుకున్నదని, దాన్ని హైకోర్టు సమర్థించడం ఆనందకరమని సీఎం అన్నారు. 23 వేల మంది ఆర్టిజన్లకు ఇది పండుగ రోజని ముఖ్యమంత్రి అభివర్ణించారు. విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు శ్రమ దోపిడీకి గురికావద్దని, మంచి జీవన ప్రమాణాలతో వారు జీవించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం అన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో జెన్‌ కో- ట్రాన్స్‌ కో సీఎండీ ప్రభాకర్‌ రావుతో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. సమర్థంగా వాదనలు వినిపించి ఆర్టిజన్ల జీవితాల్లో వెలుగులు నింపారని అభినందించారు. ఆర్టిజన్ల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తించి, పే స్కేల్‌ నిర్ణయించాలని, వారికి పి.ఆర్‌.సి.అమలు చేయాలని సీఎండీని ముఖ్యమంత్రి ఆదేశించారు. రెగ్యులర్‌ కాబోతున్న ఆర్టిజన్లకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు తీర్పు పట్ల సీఎండీ ప్రభాకర్‌ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని, కోర్టు తీర్పుతో ప్రభుత్వ నిర్ణయం అమలుకు నోచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. విద్యుత్‌ శాఖకు ఇది ఎంతో శుభ దినమని ఆయన అన్నారు. ఇప్పటి నుంచి ఆర్టిజన్లు కూడా రెగ్యులర్‌ ఉద్యోగులే అని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వారికి పే స్కేలు నిర్ణయిస్తామని, పీఆర్సీ అమలు చేస్తామని వెల్లడించారు. ఆర్టిజన్లను క్రమబద్ధీకరించే విషయంలో సహకరించిన వారందరికీ సీఎండీ ప్రభాకర్‌ రావు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సాధించుకున్న ఫలితాన్ని ఆర్జిజన్లు రెగ్యులరైజ్‌ కావడం వల్ల పొందగలిగారని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.