Tuesday, 3 November 2026

వీడిన మర్డర్‌ మిస్టరీ..

– వెంకటలక్ష్మీ హత్యకేసులో నిందితుల అరెస్టు 
– వివరాలు వెల్లడించిన డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌
హైదరాబాద్‌, మే30(జ‌నం సాక్షి) : రెండు రోజుల కిందట యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌లో సంచలనం రేపిన వెంకటలక్ష్మి మర్డర్‌ మిస్టరీ వీడింది. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు సంబంధించిన వివరాలను బుధవారం పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు. నిందితుడు సాగర్‌ 2014 నుంచి హోంగార్డుగా పని చేస్తున్నాడని.. అతడిని హోంగార్డు విధుల నుంచి పోలీసు శాఖ తొలగిస్తుందని తెలిపారు. ఈ నెల 28న మధ్యాహ్నం వెంకటలక్ష్మి పనిచేస్తున్న నగల దుకాణంలోకి వెళ్లి బ్లేడ్‌తో గొంతుకోసి ఆ తర్వాత చున్నీ బిగించి దారుణంగా హత్యచేశాడని డీసీపీ వివరించారు. అదే రోజు సాయంత్రం మృతురాలి తమ్ముడు ఆ దుకాణానికి వెళ్లి చూడడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. రెండేళ్ల కిందట మధురానగర్‌లో ఇంట్లో పనిచేసే సమయంలోనే వెంకటలక్ష్మికి సాగర్‌తో పరిచయం ఏర్పడిందని చెప్పారు. పెళ్లి చేసుకోవాలని వేధిస్తుండడంతో ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు తెలిపిందని, దీంతో అక్కడ పనిమాన్పించారన్నారు. రెండు నెలల క్రితం మళ్లీ వెంకటలక్ష్మి జువెల్లెర్స్‌లో చేరిందని, సాగర్‌ పెళ్లి చేసుకోవాలని మరోసారి వేధింపులు మొదలుపెట్టగా ఆమె నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడినట్లు డీసీపీ శ్రీనివాస్‌ వివరించారు.