Friday, 6 November 2026

వెంకటరామిరెడ్డి శతజయంతి ఉత్సవాల్లో-హోంమంత్రి నాయిని

హైదరాబాద్(జ‌నం సాక్షి): రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా అబిడ్స్‌లో పైలాన్‌ను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆవిష్కరించారు. మనమందరం గర్వించదగ్గ వ్యక్తి, విద్య వికాసం కోసం తపించిన వ్యక్తి రాజా బహదూర్ అని పేర్కొన్నారు. వెంకటరామిరెడ్డి మహిళలకు ఉచితంగా విద్యాసంస్థలు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రెడ్డి హాస్టల్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామ నినాయిని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ బుద్వేలులో 15 ఎకరాల స్థలం, రూ.10కోట్లు మంజూరు చేశారు. శతాబ్ధి ఉత్సవాల పైలాన్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. మనందరం ఏకతాటిపై ఉండాలి. రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి. సీఎం కేసీఆర్ ఇంకా నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సొసైటీలో అందరం భాగస్వామ్యమై రెడ్డిల కోసం పనిచేయాలని నాయిని పేర్కొన్నారు.రెడ్డి హాస్టల్‌తో మాకు ఎంతో అనుబంధం ఉందని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. రెడ్డిలకు రాజ్యం పాలించే శక్తి ఉందని చాలాసార్లు సీఎం కేసీఆర్ అన్నారని గుర్తుచేశారు. 80శాతం మంది రెడ్డిలు వ్యవసాయరంగంపై ఆధారపడి బతుకుతున్నారు. ఎకరాకు రూ.8వేల స్కీమ్‌తో రెడ్డిలకు లబ్ది చేకూరిందని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తీగల కృష్ణారెడ్డి, సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రెడ్డి హాస్టల్ అధ్యక్షులు పాల్గొన్నారు.