Tuesday, 3 November 2026

వైకాపాలో ఎవరూ మిగలరేమో: కాల్వ

విజయవాడ,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): వైకాపా పని అయిపోయిందని, ఎక్కడ పార్టీకి పట్టు లేకుండా పోతోందో అన్న ఆందోళన జగన్‌లో నెలకొందని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. పార్టీ నేతలు ఒక్కక్కరుగా వీడిపోతున్నారని, అందుకే భవిష్యత్తుపై జగన్‌కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.విభజన తరవాత రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుంటే.. వైకాపా నేతలు దానిని కూడా వక్రీకరిస్తున్నారని విమర్శించారు. త్వరితగతిన రాజధాని నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే ప్రజలు వచ్చే ఎన్నికల్లో మళ్లీ తెదేపాకు పట్టం కడతారని భావించి ప్రతిపక్ష నేత జగన్‌ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు దుష్పచ్రారం చేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌కు చేతనైతే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పోటీపడాలని సవాలు విసిరారు. వైకాపాలో ఇమడలేక అభివృద్దిని కోరుకుంటున్న వారే టిడిపిలోకి వస్తున్నారని అన్నారు.