వైకాపా ఆధ్వర్యంలో రైతు గర్జన
కడప,ఆగస్ట్4(జనం సాక్షి ): రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వైసిపి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు శనివారం టోల్గేట్ సెంటర్ వద్ద రైతు గర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ.. నియోజకవర్గాల్లోని మామిడి, అరటి బొప్పాయి రైతులు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం వెంటనే వారికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. టోల్గేట్ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్రెడ్డి , మండల కన్వీనర్ సుధాకర్రాజు, జడ్పిటిసి సభ్యులు రాజేశ్వరి, మాజీ జెడ్పిటిసి సభ్యులు బండారు సుభద్రమ్మ, సులోచన యాదవ్ , చెవు శ్రీనివాసుల రెడ్డి , ఆర్వి రమణ, ముఖ మధుసూధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.