వైకాపా, భాజపా అజెండా ఒక్కటే

– గాలి జనార్దన్‌కోసం సొంత జిల్లాకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి  జగన్‌
– తెదేపా ఎంపీ రాయపాటి
విజయవాడ, జూన్‌25(జ‌నం సాక్షి ) : భాజాపా, వైకాపాల జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు విమర్శించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. అన్న గాలి జనార్థన్‌రెడ్డి కోసం సొంత జిల్లాకు వెన్నుపోటు పొడిచిన తమ్ముడు జగన్‌ అని దుయ్యబట్టారు. నవ్యాంధప్రదేశ్‌ అభివృద్ధిని అడ్డుకుంటూ కొత్త మిత్రులు భాజాపా, వైకాపా నాయకులు సైందవుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విభజన హావిూల అమలుపై భాజాపా నాయకులు ప్రజాక్షేత్రంలో మాట్లాడాలని సవాల్‌ విసిరారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతూ 5 కోట్ల మంది ఆంధ్రులను నిలువునా వంచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో అందించిన ఆర్థిక సహకారానికి కడప స్టీల్‌ ప్లాంట్‌ను గాలి జనార్థన్‌రెడ్డికి బహుమానంగా ఇచ్చేందుకు యత్నిస్తూ కేంద్రం మరో క్విడ్‌ ప్రోకోకు తెరదీసిందని రాయపాటి ఆరోపించారు. జమ్మలమడుగులో బ్రహ్మణి స్టీల్స్‌ నిర్మించడానికి తనకు అనుమతి ఇవ్వాలంటూ గాలి జనార్థన్‌రెడ్డి పెట్టిన బహిరంగ విలేకర్ల సమావేశమే ఇందుకు నిదర్శనమని ఆరోపించారు.