– మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా
గుంటూరు, నవంబర్14(జనంసాక్షి): వైసీపీ నేతలు తమ తప్పులు కప్పిపుచ్చుకొని ప్రజలను నమ్మించేందుకు అద్భుతంగా నటిస్తున్నారని, వారికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని ఏపీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఎద్దేవా చేశారు. కోడికత్తి అంశం జాతీయ సమస్య అన్నట్లు వైసీపీ నేతలు రాష్ట్రపతిని కలిశారని అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సంఘటన జరిగి ఇన్ని రోజులైనా జగన్ నోరు మెదపడం లేదని మండిపడ్డారు. వ్యవస్థలపై నమ్మకంలేని వ్యక్తి ప్రతిపక్ష నేతగా అనర్హుడని ఆయన అన్నారు. మోదీపై జగన్, పవన్ పల్లెత్తి మాట మాట్లాడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ కాదని పవన్ చెప్పడం సిగ్గుచేటన్నారు. ఏపీపై కాకి గోల చేసిన జీవీఎల్..కేంద్రంపై కాగ్ నివేదికపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి విజయసాయిరెడ్డి గూడాచారి అని వ్యాఖ్యానించారు. దేశంలో 15పార్టీలను చంద్రబాబు ఏకం చేశారన్నారు. వైఎస్ కుటుంబం రాయలసీమలో రక్తం పారిస్తే..బాబు నీరు పారిస్తున్నారని మంత్రి నక్కా ఆనంద్‌బాబు పేర్కొన్నారు.




