మద్యం మత్తులో డాక్టర్ చికిత్స
అహ్మదాబాద్,నవంబర్28(జనంసాక్షి): ఓ వైద్యుడి నిర్లక్ష్యానికి ఓ బాలింత, గర్భస్థ శిశువు మృతిచెందారు. ఈ విషాద ఘటన గుజరాత్‌లో బొటాడ్ జిల్లాలో జరిగింది. ఇద్దరి మృతికి కారణమైన వైద్యుడిని పోలీస్‌లు అరెస్ట్ చేశారు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రసవం నిమిత్తం కమినిబెన్ చాంచియా(22)ను ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సోనావాలా ఆస్పత్రికి సోమవారం అర్ధరాత్రి తీసుకొచ్చారు. పురుటి నొప్పులతో బాధపడుతున్న నిండు గర్భిణీకి మద్యం మత్తులోనే డాక్టర్ పీజే లఖానీ ప్రసవం చేశాడు. శస్త్రచికిత్స వికటించడంతో బాలింత మరణించిన కొద్దిసేపటికే శిశువు కూడా చనిపోయింది. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే బాలింతతో పాటు గర్భస్థ శిశువు మృతిచెందారని ఆగ్రహించిన మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. దీనిపై పోలీస్‌లు ప్రాథమిక విచారణ చేయగా.. మద్యం మత్తులో డాక్టర్ విధులు నిర్వర్తించాడని తేలింది. వైద్యుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని రక్త నమూనాలను టెస్టింగ్ కోసం పంపినట్లు జిల్లా ఎస్పీ హర్షద్ మెహతా తెలిపాడు.




