Friday, 6 November 2026

శబరిమలలో మహిళలకు ప్రత్యేక దర్శనాలు

సుప్రీం ఆదేశాలు అమలు చేసే క్రమంలో అఖిలపక్షం

సిఎం విజయన్‌ ప్రతిపాదనలపై కుదరని ఏకాభిప్రాయం

సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్‌, బిజెపి

తిరువనంతపురం,నవంబర్‌15(జ‌నంసాక్షి): శబరిమల అయ్యప్ప దేవాలయంలోకి మహిళల ప్రవేశానికి రాజీసూత్రాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ ప్రతిపాదించారు. మహిళల ప్రత్యేక రోజులను ప్రకటించే అవకాశం ఉందని విజయన్‌ గురువారం చెప్పారు. 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్కులైన మహిళలకు ఈ దేవాలయంలో ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. మండల – మకరవిళక్కు పూజల సమయంలో శుక్రవారం ఈ దేవాలయాన్ని తెరుస్తారు. మకర సంక్రాంతి తర్వాత మళ్ళీ మూసివేస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రతిపాదన చేశామని అన్నారు. సీఎం నేతృత్వంలో గురువారం జరిగిన అఖిల పక్ష సమావేశం నుంచి బీజేపీ, కాంగ్రెస్‌ వాకౌట్‌ చేశాయి. అఖిల పక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో సీఎం మాట్లాడుతూ అయ్యప్ప దేవాలయం ప్రధాన అర్చకుడితో చర్చలు జరుపుతామని చెప్పారు. పండలం ప్యాలెస్‌ ప్రతినిథులతో కూడా మాట్లాడతామన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడంలో ఏమాత్రం వెనుకకు తగ్గేది లేదన్నారు. అయ్యప్ప దేవాలయంలో మహిళల ప్రవేశానికి ప్రత్యేక రోజులను కేటాయించడానికి చర్చలు జరుపుతామని తెలిపారు. భక్తులందరికీ భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. శబరిమలను 10 నుంచి 50ఏళ్ల వయస్సు గల మహిళలు ప్రత్యేక రోజుల్లో దర్శించుకునేలా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందా లేదా అన్నదానిపై ఆలయ ప్రధాన పూజారి, పందలం ప్రతినిధులతో చర్చిస్తామన్నారు. ఇవే విషయాలను తాను అఖిలపక్ష సమావేశంలోనూ స్పష్టం చేశానన్నారు. భాజపా, కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తున్నప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును తాము అమలు చేస్తామన్నారు. ప్రజల నమ్మకాల కన్నా వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఆందోళనకారులు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అని ఆయన కోరారు. ప్రభుత్వం ఎటువంటి పక్షపాతం చూపటంలేదని, కేవలం అత్యున్నత న్యాయస్థానం తీర్పును మాత్రమే అమలు చేస్తోందన్నారు. భక్తులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ఎల్లప్పుడూ వారికి భద్రత కల్పిస్తుందని విజయన్‌ హావిూ ఇచ్చారు. కాగా.. శబరిమల అంశంపై నేడు ప్రభుత్వం చేపట్టిన అఖిలపక్ష సమావేశం నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవట్లేదని, ఇది భక్తులకు సవాల్‌గా మారుతోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. శబరిమలలో శాంతి నెలకొల్పేందుకు వచ్చిన ఓ సువర్ణావకాశాన్ని సీఎం వృథా చేశారని వారు దుయ్యబట్టారు. అటు భాజపా కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. ప్రభుత్వం శబరిమలను రణరంగంగా మార్చాలని చూస్తోందని భాజపా నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంలో పోలీసులు స్వతంత్రంగా వ్యవహరించి సంప్రదాయాలను పరిరక్షించాలని భాజపా నేతలు కోరడం గమనార్హం.