Wednesday, 4 November 2026

శాసనసభను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం

 

– విధుల నిర్వహణలో న్యాయబద్దంగా వ్యవహరిస్తా

– తన ఏకగ్రీవానికి సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు

– స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణ శాసనసభను సమర్థవంతంగా నడిపి ఆదర్శవంతంగా నిలుపుతానని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రెండో శాసనసభకు స్పీకర్‌ ఎన్నుకున్నందుకు ప్రతీ ఒక్క సభ్యునికి హృదయపూర్వక ధన్యవాదాలు. స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్‌ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో స్పీకర్‌ మాట్లాడుతూ..శాసనసభాపతి పదవి అత్యంత కీలకమన్నారు. సభ నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, విధుల నిర్వహణలో సభాపతిగా న్యాయబద్దంగా వ్యవహరిస్తానన్నారు. సభ్యులందరి సహకారంతో సభా కార్యక్రమాలను ఆదర్శవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానన్నారు. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా నడుపుకోవడం మనందరి బాధ్యత అని పోచారం పేర్కొన్నారు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సభకు అంతరాయం కలిగించడం గౌరవప్రదం కాదని, ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా సభ నిర్వహించుకుందామని సభ్యులను కోరారు. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో విూరంతా నాకు సహకరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు. అందరం కలిసి సభను ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుదామని, శాసనసభ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా సభ్యులందరూ వ్యవహరిస్తారని ఆశిస్తున్నానని పోచారం పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్ర రైతాంగానికి సేవ చేసే అవకాశం కల్పించడమే కాకుండా లక్ష్మీపుత్రుడిగా బిరుదు ఇచ్చిన సీఎం కేసీఆర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.