Tuesday, 3 November 2026

శాస్త్ర సాంకేతిక ఫలాలు.. రైతులకు ఉపయోగపడాలి

– వ్యవసాయ, ఉద్యానోత్పత్తులు చేరితేనే ప్రయోజనం
– రైతులు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు అన్నిచర్యలు చేపట్టాం
– వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
– అగ్రిటెక్స్‌-2019 ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి
– రాష్ట్రంలో యూరియా కొరత లేదు
– సిద్ధిపేటలో రైతు మరణానికి, యూరియాకి ఎలాంటి సంబంధం లేదన్న మంత్రి
హైదరాబాద్‌, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   శాస్త్ర సాంకేతిక ఫలాలు రైతులుకు ఉపయోగడాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం మాదాపూర్‌ హైటెక్స్‌లో అగ్రిటెక్స్‌-2019 ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు రుణమాఫీ, 24 గంటల విద్యుత్‌, రాయితీ విత్తనాలు అందిస్తున్నామని తెలిపారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖలను బలోపేతం చేశామన్నారు. రైతుబంధు పథకం కింద డబ్బు రాని రైతులకు త్వరలోనే నిధులు ఇస్తామని చెప్పారు. శాస్త్ర సాంకేతిక ఫలాలు రైతులకు ఉపయోగపడాలని, వ్యవసాయ, ఉద్యానోత్పత్తులు రైతులకు చేరితేనే ప్రయోజనం ఉంటుందన్నారు. రైతు తన కాళ్లపై బలంగా నిలబడేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామని మంత్రి చెప్పారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక అచ్చుమాయపల్లి ఘటనపై మంత్రి స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు. రైతు ఎల్లయ్య దురదృష్టవశాత్తు గుండెపోటుతో మృతి చెందారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ అంటే గిట్టని వారే ప్రభుత్వంపై దుష్పచ్రారం చేస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు యూరియా కొరత ఎక్కడా లేదన్నారు . రాష్టాన్రికి యూరియా రావడంలో ఒక్కోసారి రెండు రోజులు, ఇంకోసారి 4 రోజులు వివిధ కారణాల వల్ల ఆలస్యమవడం సాధారణమే అన్నారు. వార్తాపత్రికల్లో వస్తున్న వార్తలను చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో యూరియా కొరత లేదని అన్నారు. అక్కడి ఎమ్మెల్యే రామలింగారెడ్డితో తాను మాట్లాడానని అన్నారు. రైతు మరణానికి, యూరియా కి ఎలాంటి సంబంధం లేదనీ.. అది యాదృచ్చికంగా జరిగిందని అన్నారు.