Wednesday, 4 November 2026

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద

కృష్ణాబేసిన్‌లో జలకళ

శ్రీశైలం,జూలై24(జ‌నంసాక్షి): కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతోంది. అలాగే కృష్ణా బేసిన్‌లోని జలాశయాలకు జలకళ వచ్చింది. దీంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఇప్పటికే ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. తుంగభద్ర నదిపై ఉన్న తుంగభద్ర, సుంకేసుల జలాశయాలు సైతం నిండుకుండలా మారాయి. శ్రీశైలం జలాశయానికి ఇటు కృష్ణా, అటు తుంగభద్ర నదుల నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో శ్రీశైలంలో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. ఎగువన వర్షాల కారణంగా నీటి ప్రవాహం వస్తోందని అధికారులు తెలిపారు. అటు ఆల్మట్టి జలాశయానికి భారీగా వరద నీరు చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 129.7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 113 టీఎంసీల నీరు చేరింది. జలాశయంలోకి 1,69,145 క్యూసెక్కుల నీరు చేరుతుండగా 1,78,196 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 37.6 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 32.8 టీఎంసీలుగా కొనసాగుతోంది. జూరాల పూర్తిస్థాయి సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 9.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది.శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా… ప్రస్తుత నీటి మట్టం 853.6 అడుగులు. జలాశయంలో 1,83,826 క్యూసెక్కుల నీరు చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 88.2 టీఎంసీలు. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయిలో నిండిపోయింది. జలాశయం సామర్థ్యం 100.8 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 94.6 టీఎంసీలు. తుంగభద్రకు ఇన్‌ ఎ/-లో 70,271 క్యూసెక్కులు… ఔట్‌ ఎ/-లో 71,125 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్ర నదిపై కర్నూలు సవిూపంలో నిర్మించిన సుంకేసుల జలాశయానికి వరద నీరు పోటెత్తింది. జలాశయం సామర్థ్యం 1.2 టీఎంసీలు కాగా… పూర్తిస్థాయిలో నిండిపోయింది. దిగువకు సుమారు 70 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వరద ఇలాగే కొనసాగితే శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండడం ఖాయంగా

కనిపిస్తోంది.