Tuesday, 3 November 2026

షాద్‌నగర్‌లో ఎన్‌కౌంటర్‌.. నయీం హతం

indexషాద్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌లో కాల్పులు కలకలం రేపాయి. గ్రేహౌండ్స్‌ పోలీసులు. నల్గొండ స్పెషల్‌ పార్టీ పోలీసులు జరిపిన కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ నయీం, అతడి అనుచరుడు మృతిచెందారు. షాద్‌నగర్‌లోని మిలీనియం టౌన్‌షిప్‌ ఏరియాలో బాషా అనే వ్యక్తి ఇంటిని చుట్టుముట్టి పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో గ్యాంగ్‌స్టర్‌ నయీం సహా మరో దుండగుడు హతమయ్యారు. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. నయీం కారు డ్రైవర్‌ పరారయ్యాడు. సంఘటనా స్థలం నుంచి ఏకే 47, నాలుగు షార్ట్‌గన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. టౌన్‌షిప్‌ను నలువైపులా చుట్టుముట్టి సోదాలు చేపట్టారు. స్థానికులను ఇతర ప్రాంతాలకు తరలించారు.

100కి పైగా కేసులు
నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం 1989లో పీపుల్స్‌వార్‌లో చేరాడు. నక్సలైట్‌గా జీవితం ప్రారంభించిన నయీం అనేక మంది నక్సల్స్‌ నేతలనే హత్య చేశాడు. మావోయిస్టు కార్యకర్త బెల్లి లలితను దారుణంగా హత్య చేసి నయీం తొలిసారి వార్తల్లోకి ఎక్కాడు. తర్వాత పోలీస్‌ కోవర్టుగా మారాడు. వివిధ కేసుల్లో పట్టుబడి 11సార్లు పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. 1993, జనవరి 27 ఐపీఎస్‌ అధికారి కేఎస్‌ వ్యాస్‌ను హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. మాజీ మావోయిస్టు సాంబశివుడు, రాములు, పటోళ్ల గోవర్థన్‌రెడ్డి, పౌరహక్కుల సంఘం నాయకుడు పురుషోత్తమ్‌, అజీంల హత్య కేసుల్లో నయీం ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. హత్యలు భూదందాలు, సెటిల్‌మెంట్లు, బెదిరింపులు ఇలా.. 100కి పైగా కేసుల్లో నయీం నిందితుడిగా ఉన్నాడు. గత కొంతకాలంగా నయీంపై దృష్టి పెట్టిన తెలంగాణ పోలీసులు పక్కా సమాచారంతో ఆపరేషన్‌ చేపట్టి నయీంను మట్టుబెట్టారు.

8brk-57cc 8brk57aaఅసలు ఎవరీ నయీం?

నయీముద్దీన్. అలియాస్ భువనగిరి నయీం. అతడి పేరు చెప్తే రాజకీయ నాయకుల నుంచి పౌర హక్కుల సంఘాల నేతల దాకా ఉలిక్కిపడతారు. మాజీ నక్సలైట్లకు, మావోయిస్టులకు కంటిపై కునుకుండదు. 40 మందికి పైగా హత్యలు, బెదిరింపుల కేసులతో పాటు లెక్కలేనన్ని సెటిల్ మెంట్లు, దందాలు చేశాడు. పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా మారాడు. కొన్ని ఏళ్లుగా పరారీలోనే ఉండి నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఒకరకంగా రాష్ట్రం పాలిట దావూద్ ఇబ్రహీంలా మారాడు.

నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం సమ సమాజ స్థాపన కోసమంటూ మూడు దశాబ్దాల క్రితం పీపుల్స్ వార్లో చేరాడు. వార్ అగ్రనేతలు పటేల్ సుధాకర్రెడ్డి, శాఖమూరి అప్పారావుల దగ్గర శిష్యరికం చేశాడు. వారికి సన్నిహితుడిగా మెలిగాడు. నక్సలైట్గా జీవితం ప్రారంభించిన నయీం, ఆ తరవాత నక్సలైట్లనే అంతం చేయడమే తన జీవితాశయమని ప్రకటించాడు! దీనికి సంబంధించి అనేక చోట్ల ప్రదర్శనలను కూడా నిర్వహించాడు. ఈ పరిణామ క్రమంలోనే అప్పటి పోలీసులు నయీంను చేరదీశారు. డిపార్ట్ మెంటు అజ్ఞాత కార్యకలాపాల్లో నయీంని పావుగా వాడుకోవడం ప్రారంభించారు. ఓ దశలో కోవర్టుగా మారి నక్సలైట్ల రహస్యాలను పోలీసులకు చేరవేసేవాడని కూడా చెబుతారు. నయీం ఇచ్చిన సమాచారంతోనే అనేక ఎన్కౌంటర్లలో పీపుల్స్వార్, మావోయిస్టు నేతలు హతమయ్యారు.

కోవర్టు జీవితం గడిపిన నయీం పోలీసు ఉన్నతాధికారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. వారి చేతిలో ఆయుధంగా మారాడు. చట్ట పరిధిలో చేయలేని అనేక పనుల్ని పోలీసులు అతడితో చేయించుకున్నారని చాలామంది చెప్తుంటారు. ఇదే అతడి బలంగా మారిందని కూడా కొందరు అధికారులంటారు. నయీంకు కొందరు పోలీసులే సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ ‘పోలీసు ఆయుధం’ జాడను సీబీఐ కూడా కనిపెట్టలేకపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో నయీం కోసం గుజరాత్ పోలీసులతో పాటు సీబీఐ కూడా గాలించింది. కానీ వారెవరికీ అతని జాడయినా తెలియలేదు. ఉమ్మడి రాష్ట్రానికి చెందిన కొందరు ఉన్నతాధికారుల మద్దతే ఇందుకు కారణమని తెలుస్తోంది.

నయీం చేసిన అనేక దారుణ హత్యల్ని ఇప్పటికీ పోలీసులే మర్చిపోలేరు. అజ్ఞాతంలో ఉండగానే భువనగిరిలో బెల్లి లలిత దారుణంగా హతమయింది. అందులో ప్రధాన సూత్రధారి, పాత్రధారి నయీం. దాంతో నయీం పేరు మారుమోగింది. గ్రేహౌండ్స్ కు ఆద్యుడైన ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ హత్య కేసులోనూ ఇతను నిందితుడు. ఈ కేసు 14 ఏళ్ల తరవాత కోర్టులో వీగిపోయింది. పౌర హక్కుల నేతలు పురుషోత్తం, కరుణాకర్లను పట్టపగలే తెగనరికిన కేసుల్లో కూడా నయీం పాత్ర సుస్పష్టం. ఆజం అలీ హత్య వెనుక కూడా నయీం హస్తం ఉంది. మాజీ మావోయిస్టులు గణేశ్, ఈదన్న హత్య వెనకా నయీమే మాస్టర్మైండ్ అని పోలీసులు చెప్తుంటారు. ఎల్బీ నగర్కు చెందిన రియల్టర్ రాధాకృష్ణ, మాజీ మావోయిస్టు నేత, టీఆర్ఎస్ నేత సాంబశివుడు, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి… ఇలా అనేక దారుణ హత్యలకు నయీం, అతడి గ్యాంగ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాయి. అనేక కోర్టుల్లో నయీంపై నాన్బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయి.

నయీం నేరాలు చేయించే స్టైల్, ఆ తరవాత నిందితులు అరెస్టయ్యే విధానం ఆద్యంతం పక్కాగా ఉంటాయి. అందుకే ఏ కేసులోనూ పోలీసులు నయీంకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలు సేకరించలేకపోతారు. సైబరాబాద్, హైదరాబాద్కు చెందిన కొందరు యువకులను, నేరగాళ్లను చేరదీసి నయీం తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ ముఠా కుట్రల్ని జంట కమిషనరేట్ల పోలీసులు అనేక సార్లు ఛేదించారు. అయితే నేరాలకు పాల్పడేది ఒకరైతే, 48 గంటల్లోనే లొంగిపోయే వారు మరొకరు! అందుకే ఏ కేసులోనూ నయీం వ్యవహారం పూర్తిస్థాయిలో వెలుగులోకి రాలేదు.

విద్యార్థి నాయకుడి నుంచి గ్యాంగ్ స్టర్ వరకు ఎదిగిన నయీమ్ నల్గొండ జిల్లా భువనగిరి నుంచే ప్రస్థానం ప్రారంభించాడు. తండ్రి విద్యుత్శాఖలో పనిచేసేవాడు. నయీంకు ఒక తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. విద్యాభ్యాసం భువనగిరిలోనే సాగింది. మొదట ఎస్ఎఫ్ఐ యాక్టివిస్ట్. రాడికల్స్ స్టూడెంట్ యూనియన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. 1990 పీపుల్స్ వార్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. యాదగిరిగుట్టలో పోలీసులపై బాంబు విసిరి పారిపోయేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.1993లో ఎస్పీ వ్యాస్ హత్య కేసుతో వెలుగులోకి వచ్చాడు. అనంతరం కొంత కాలం తర్వాత మళ్లీ అరెస్టయి జైలులోనే పీపుల్స్ వార్ వ్యతిరేక కార్యకలాపాలు మొదలు పెట్టాడు. మాజీ నక్సలైట్లు, ప్రజా సంఘాల నేతలు, పౌరహక్కుల నేతల హత్యకేసుల్లో ఏ-1 నేరస్థుడిగా ఉంటూనే తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. భూదందాలు, అక్రమ వసూళ్లు, సెటిల్ మెంట్లు తదితర నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసిరాడు. దీంతో పోలీసులు నయీంపై ఒత్తిడి తెచ్చేందుకు అతడి అనుచరులపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. వీరిలో షకీల్ అనే వ్యక్తి మృతిచెందగా.. పాశం శ్రీనివాస్, సుధాకర్లు అనే నిందితులు ఇటీవల నల్గొండ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. కొద్దిరోజులకే నయీం పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *