సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తాం!
– మద్యం మహమ్మారితో ఎన్నో జీవితాలు నాశనమవుతున్నాయి
– దేవాలయ భూముల రక్షణకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్
– బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
హైదరాబాద్, అక్టోబర్13(జనంసాక్షి) : తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేదం చేస్తామని బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. సాయంత్రం ఆరుగంటలకంతా మద్యం అమ్మకాలు నిలిపివేయాలని, బార్లు కూడా సాయంత్రం ఆరు గంటలకు మూసివేయాలన్నారు. మద్యం మహమ్మారి ఎంతో మంది జీవితాలను నాశనం చేస్తోందని, అందుకే మద్యపాన నియంత్రణ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జాతరకు వెళ్లే వారికోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తామన్నారు. హనుమాన్, అయ్యప్ప, అమ్మవారి దీక్ష ముగిసి ఆలయాలకు వెళ్లేవారికోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. వక్ఫ్, ఎండోమెంట్, కైస్త్రవ దేవాలయాల భూమల పరిరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగుల కోసం ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ పంచాయతీ నుంచి గ్రేటర్ మున్సిపాలిటీ వరకు ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఉద్యోగ భద్రత, హెల్త్ స్కీం కల్పిస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లపై అత్యధిక వ్యాట్ తెలంగాణ వసూలు చేస్తోందని అన్నారు. తెలంగాణ వసూలు చేస్తున్న వ్యాట్‌ను తాము అధికారంలోకి వస్తే ఎత్తివేస్తామని హావిూ ఇచ్చారు. నాలుగేళ్ల పాలనలో కేసీఆర్ తెలంగాణ ప్రజలకు చేసిందేవిూ లేదని విమర్శించారు. కేవలం కొన్ని ప్రాంతాల అభివృద్ధికే ప్రాధాన్యతనిచ్చారని, మిగిలిన ప్రాంతాలను అభివృద్ధిలోనిర్లక్ష్యం చేశారని అన్నారు. కేసీఆర్ పాలనపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారని, గతంలో కాంగ్రెస్ పాలన చూసి విసిగిపోయారన్నారు. ప్రత్యామ్నాయంగా బీజేపీ అధికారంలోకి వస్తేనే మేలని ప్రజలంతా భావిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు తధ్యమని ప్రభాకర్ జోస్యం చెప్పారు.