తక్షణ సాయం కింద.. రూ.1200 కోట్లు ఇవ్వండి
– ‘తిత్లీ’ బీభత్సంతో తీవ్రనష్టం వాటిల్లింది
– ప్రధాని నరేంద్రమోదీకి చంద్రబాబు లేఖ
అమరావతి, అక్టోబర్13(జనంసాక్షి) : ఏపీలో ‘తిత్లీ’ తుఫాను సృష్టించిన భీభత్సంతో శ్రీకాకుళం తదితర ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని, తక్షణ సాయం కింద రూ. 1200 కోట్లు అందించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో తుఫాన్ ప్రభావం, నష్టం వివరాలను వివరించారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.2,800 కోట్ల మేర నష్టం జరిగిందని లేఖలో పేర్కొన్నారు. తక్షణ సాయం కింద రూ. 1200 కోట్లు విడుదల చేయాలని కోరారు. తిత్లీ తుపాను కారణంగా విద్యుత్ రంగానికి రూ.500 కోట్లు, రహదారులు, భవనాల శాఖకు రూ. 100 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు మరో రూ.100 కోట్లు నష్టం వాటిల్లిందని వివరించారు. వ్యవసాయ, ఉద్యాన తోటలకు సంబంధించి రూ.1800 కోట్ల నష్టం వాటిల్లగా పశుసంవర్ధక, మత్స్యశాఖకు రూ.100కోట్ల మేర నష్టం కలిగిందని లేఖలో పేర్కొన్నారు. గ్రావిూణ నీటిసరఫరా శాఖకు రూ.100 కోట్లు, జలవనరుల శాఖకు
రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయకచర్యలను వేగవంతం చేసిందని.. కేంద్రం కూడా ముందుకు వచ్చి ఉదారంగా సాయం అందించాలని కోరారు. తిత్లీ తుపానుతో భారీగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లాకు మంత్రులు, తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక నెల జీతం విరాళంగా ప్రకటించారు. అతలాకుతమైన శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్ అన్నారు.