హైదరాబాద్,సెప్టెంబర్5(జనం సాక్షి): ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్యాంక్ బండ్‌పై ఉన్న విద్యావేత్త, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినిలు, పలువురు అధికారులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో, స్వరాష్ట్రంలో అత్యున్నత విద్యా ప్రమాణాలతో బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుందామని కడియం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులందరినీ సగౌరవంగా సన్మానించుకుందామన్నారు. ఎంపీ బండారు దత్తాత్రేయ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్, ఇతర ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ఈ వేడుకలకు హాజరయ్యారు. యావత్ దేశం, విద్యార్థి లోకానికి ఆదర్శంగా నిలిచిన సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలు చిరస్మరణీమని బండారు దత్తాత్రేయ కొనియాడారు. విలువలతో కూడిన విద్య కోసం కృషి చేసిన రాధాకృష్ణన్ స్ఫూర్తిని అందరూ అందుకోవాలన్నారు. దేశంలో అవినీతి, అత్యాచారాలు, నిరుద్యోగం నిరోధించినప్పుడే నిజమైనస్వాతంత్యం అని పేర్కొన్నారు.




