– పార్టీకి చెడ్డపేరు తెస్తే చూస్తూ ఊరుకోం
– చింతమనేని తీరుపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి, నవంబర్17(జనంసాక్షి) : పార్టీకి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తిస్తూ.. తన సహనానికి పరీక్ష పెడితే ఉపేక్షించేది లేదని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతమనేని అనుచరులు గద్దె కిషోర్ మరికొందరు గార్లమడుగు మాజీ సర్పంచి సాంబశివకృష్ణారావుపై దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా చింతమనేని తీరు మారడం లేదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కరు చేసే తప్పునకు పార్టీ మొత్తం సమాధానం చెప్పుకోవాల్సి వస్తోందంటూ చంద్రబాబు వద్ద పలువురు సీనియర్ నేతలు ప్రస్తావించారు. చింతమనేని తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు చింతమనేనిపై మండిపడ్డారు. పని చేస్తే సరిపోదని.. పద్ధతిగా ఉంటేనే పార్టీలో భవిష్యత్తు ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సహనానికి పరీక్ష పెడితే ఉపేక్షించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. ఇప్పటికే చింతమనేని పై అటు వైసీపీ నేతలతో పాటు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే గత ఏడాది క్రితం చింతమనేని నియోజకవర్గంలోని ఓ మహిళా తహసీల్దార్‌పై దురుసుగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. కాగా అప్పటి నుంచి పలు వివాదాల్లో చింతమనేని చిక్కుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చింతమనేని రౌడీలా వ్యవహరిస్తున్నారని, తీరు మార్చకోకపోతే గుణపాఠం చెబుతామని పవన్ హెచ్చరించారు. పవన్ వ్యాఖ్యలకు చింతమనేని అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. కాగా వైసీపీ నేతలు సైతం చింతమనేని తీరుపై తీవ్ర స్థాయిలో పలుమార్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నుంచి చింతమనేనిపై ముప్పేట దాడి జరుగుతుండటంతో మరోమారు చింతమనేని అనుచరులు మాజీ సర్పంచ్‌పై దాడికి దిగారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు చింతమనేని తీరుపై చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
సహనానికి పరీక్షపెడితే.. ఉపేక్షించేది లేదు




