హైదరాబాద్,మే26(జనం సాక్షి): పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న ఆయిల్ ధరలతో సామాన్య మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. గతంలో ఏన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న తీరు సామాన్యులను కలవరానికి గురి చేస్తోంది. ప్రస్తుత సమాజంలో నూటికి 90 శాతం మంది ఏదో ఒకరకమైన వాహనాన్ని వినియోగిస్తున్నారు. దీంతో వీరి పర్సు ఖాళీ అవుతోంది. దీనిపై ఆందోళనలను ఎవరు కూడా పట్టించుకునే వారు కరువయ్యారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయనే నెపంతో పెట్రోల్, డీజిల్ ధరలను ఇష్టారీతిన పెంచేస్తున్నారు. ఈ ధరలను నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. క్రూడాయిల్ ధరలు పెరిగితే పెట్రోల్, డిజీల్ ధరలు ఆకాశాన్నంటుతుండగా అదే క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు మాత్రం ఈ ధరలను తగ్గించడం లేదు. దేశ్యాప్తంగా లక్షల కుటుంబాలు ఏదో ఒకరకమైన వాహనాన్ని వినియోగిస్తున్నారు. పెట్రోల్ అదే విధంగా డీజిల్ విక్రయాలు కూడా భారీగానే ఉన్నాయి. గ్రావిూణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలసలు పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు నిరుద్యోగ యువతకు ఉపాధిని చూపిస్తున్నాయి. ఈ క్రమంలో నగరీకరణ పెరిగి వాహనాల సంఖ్య రెట్టింపు అవుతోంది. సొంత వాహనం ఇప్పుడు షరామామూలయ్యింది. ఫలితంగా గ్రావిూణ పాంతాల్లో కూడా ఇంటికో వాహనం ఉంటోంది. పెట్రోల్, డీజిల్ పెరిగిన ధరల ప్రకారం ఒక్కో వ్యక్తిపై నెలకు కనీసంగా వేయి రూపాయల అదనపు భారం పడుతోంది.జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ ధరలను తీసుకొస్తే సగం ధర మాత్రమే వినియోగదారునికి అందుతుంది. జీఎస్టీ పరిధిలో లేనందున ఇష్టారీతిన ధరలు పెరుగుతున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
సామాన్యుల నడ్డివిరుస్తున్న పెట్రో ధరలు




