Wednesday, 4 November 2026

సింగరేణిలో తీవ్రమవుతున్న కాంట్రాక్ట్‌ కార్మికుల ఆందోళన

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి): ఒప్పంద కార్మికుల సమస్యలను పరిష్కరించే వరకు వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తామని కార్మిక సంఘాల నేతలు ప్రకటించారు.  కాంట్రాక్టు కార్మికులకు ఒకటో కేటగిరి వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ  ధర్నా చేపట్టారు. ఒప్పంద కార్మికుల ఐకాస ఆధ్వర్యంలో ఒప్పంద కార్మికులు నిరసన చేపట్టారు. అధికారులకు సమ్మె నోటీసు అందజేశారు. మార్చి 13న సమ్మెలో పాల్గొంటామని చెప్పారు. సింగరేణి సంస్థలో 15 ఏళ్లుగా ఒప్పంద పద్ధతిన కాంట్రాక్టు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. అతి తక్కువ వేతనాలతో చెల్లించడంతో కార్మికులకు కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. 9వ వేతన ఒప్పందం నుంచి కాంట్రాక్టు కార్మికులకు ఒకటో కేటగిరి వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కోలిండియాలో చెల్లిస్తున్న హైపవర్‌ వేతనాలను సింగరేణిలో అమలు చేయాలన్నారు. కార్మికులకు బోనస్‌, ఆస్పత్రి సౌకర్యం కల్పించాలన్నారు. వేతనంతో కూడిన జాతీయ పండుగ సెలవులు అమలు చేయాలని కోరారు. సులభ్‌ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న ఏరియర్స్‌ను వెంటనే చెల్లించి, జీఓ ప్రకారం కనీస వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు.  ఒకటో కేటగిరి వేతనాలు చెల్లించాలని డిమాండు చేస్తు సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు, ఒప్పంద కార్మికులు శ్రీరాంపూర్‌లోని జీఎం కార్యాలయం వద్ద,గోలేటిలోని జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఇదే పద్దతిలో ఇకముందు కూడా సాగుతామని ప్రకటించారు. సులభ్‌ కార్మికులకు పెండింగులో ఉన్న ఎరియర్స్‌ తక్షణమే చెల్లించి, జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలన్నారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులకు కోలిండియాలో మాదిరిగా బోనస్‌, ఆసుపత్రి సౌకర్యాలు కల్పించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *