సింగరేణిలో 15శాతం వృద్దిరేటు

మరింత ఆశాజనక ఉత్పత్తి కోసం యత్నాలు

ఆదిలాబాద్‌,జనవరి28(జ‌నంసాక్షి):రాష్ట్రంలో సింగరేణి సంస్థ అనేక విజయాలతో ముందుకు సాగుతున్న దని సింగరేణి అధికారులు అన్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రోత్సాహంతో గతంలో సింగరేణిలో 15 శాతం వృద్ధిరేటు సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అనేక బొగ్గు కంపెనీలున్నా ఎక్కడా లేని విధంగా సింగరేణిలో మాత్రమే సొంతంగా ఒక విద్యుత్తు కేంద్రాన్ని నెలకొల్పిందన్నారు. మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద నిర్మించిన 1200 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్తు కేంద్రం నుంచి విద్యుత్తును గజ్వేల్‌లోని పవర్‌ గ్రిడ్‌కు అందించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం మన సింగరేణి అని పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధిస్తే మంచి లాభాలు వస్తాయన్నారు. కార్మికుల సహకారంతో అనేక విజయాలు సాధిస్తున్నామని అన్నారు. పెరుగుతున్న బొగ్గు అవసరాలకు అనుగుణంగా కొత్తగా ఏర్పడిన మన తెలంగాణను బంగారు తెలంగాణగా రూపుదిద్దుకునేలా చేయాలనే సంకల్పంతో సంస్థ ముందుకు సాగుతుందన్నారు. అందులో భాగంగానే బొగ్గు ఉత్పిత్తి లక్ష్యాన్ని 60 మిలియన్‌ టన్నుల నుంచి మరో అయిదేళ్లలో 90 మిలియన్‌ టన్నులకు పెంచుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తుందని వివరించారు. సింగరేణి కాలరీస్‌లో రాబోయే అయిదేళ్లలో 20 ఉపరితల గనులు, 11 భూగర్భ గనులు ప్రారంభించ నున్నట్లు సంస్థ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీధర్‌ ఇటీవలే ప్రకటించారు. దీనికి అనుగుణంగా కార్యాచారణ రూపొందుతోందని అన్నారు. ఉపరితల గనులపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి ఓసీపీ గనులతోపాటు భూగర్భ గనులు ప్రారంభించి సంస్థను ప్రగతి పథంలో నడిపించేందుకు సంసిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణిలో 20ఏళ్ల క్రితం నిలిచిపోయిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి ప్రారంభించడానికి అనుమతివ్వడం హర్షణీయమన్నారు. కొత్తగనుల ఏర్పాటు ద్వారా సంస్థలో 11,624 మంది కార్మికులు అవసరముంటుందన్నారు. కొత్తగనుల ప్రారంభం తరువాత వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దక్కుతాయన్నారు. కార్పొరేట్‌ స్థాయి వైద్య పరీక్షలు, వైద్య పరికరాలు కంపెనీ ఆసుపత్రుల్లో సమకూర్చామన్నారు.