సికింద్రాబాద్‌లోని ఓల్డ్ బోయిన్‌పల్లి ప్రాంతంలో కాల్పుల కలకలం చెలరేగింది. మల్లికార్జున నగర్ ప్రాంతానికి చెందిన యాదగిరి కాంగ్రెస్ అనే నాయకుడు టార్గెట్‌గా కాల్పులు జరిగాయి. ఆయన ఇంట్లోకి వెళ్తుండగా బైక్ మీద వచ్చిన దుండగులు.. ఆయనపై ఆరు రౌండ్ల కాల్పులు జరిపారు. కడుపులోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లినట్లు తెలిసింది. దుండగులు తాము కాల్పులు జరిపిన తుపాకిని కూడా అక్కడే విడిచిపెట్టి అక్కడి నుంచి పరారయ్యారని అంటున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. స్థానికులు కూడా కాల్పుల విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. భూవివాదంతోనే ప్రత్యర్థులు యాదగిరిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భూవివాదాలలో యాదగిరి పేరు తరచుగా వినిపిస్తోందని స్థానికులు అంటున్నారు
పోలీసులు కూడా దీనిపై ఇప్పుడే దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులు జరిపిన దుండగులు ఎవరనే విషయం ఇంకా తెలియరాలేదు. ఇటీవలే అల్వాల్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. ఆ ఘటనకు, ఇప్పటి ఘటనకు ఏమైనా సంబంధం ఉందా లేదా అనే విషయం కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఈమధ్య హైదరాబాద్ శివార్లలో భూ లావాదేవీల గురించి గొడవలు జరుగుతున్నాయి. ఈ కాల్పులకు అదే కారణమా లేదా వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలియాల్సి ఉంది.
కాల్పులు జరిపింది బాబు?
యాదగిరిపై కాల్పులు జరిపింది డక్కల బాబు అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇతడు అల్వాల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఇతడిపై గతంలో రౌడీషీట్ తెరిచారు. సీసీటీవీ ఫుటేజిలో అతడిని గుర్తించినట్లు చెబుతున్నారు. పరారీలో ఉన్న అతడి కోసం ప్రస్తుతం గాలిస్తున్నారు. పోలీసు కమిషనర్ కూడా సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రక్రియను పరిశీలిస్తున్నారు.




