హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని మినిస్టర్ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మంటల ధాటికి ఆరు అంతస్తుల భవనం పూర్తిగా దెబ్బతింది.
భవనంలో 12 గంటలకు పైనే అగ్నికీలలు ఉండటంతో లోనికి ఎవరూ వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు భవనంలో బిహార్‌కు చెందిన ముగ్గురు కూలీలు జునైద్, వసీం, అక్తర్ చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఆచూకీ లభ్యంకాని కూలీల సెల్‌ఫోన్ లోకేషన్ మంటలు చెలరేగిన భవనంలోనే చూపిస్తుండటంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.
కూలీలు ముగ్గురూ అదే భవనంలో చిక్కుకుని ఉంటే మాత్రం వారు సజీవ దహనమయ్యే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. భారీ క్రేన్ సాయంతో బయట నుంచి భవనంలోని పై అంతస్తుల్లోకి వెళ్లేందుకు యత్నిస్తున్నారు. భవనం పూర్తిగా దెబ్బతిన్న నేపథ్యంలో గాలింపు పూర్తయ్యాక కూల్చివేతపై అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశముంది.
అగ్నిప్రమాద సహాయ చర్యల్లో పాల్గొని అస్వస్థతకు గురైన ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏడీఎఫ్‌వో ధనుంజయరెడ్డితో పాటు ఫైరింజన్ డ్రైవర్ నర్సింగరావు గురువారం అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నర్సింగరావు పరిస్థితి విషమంగా ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరామర్శ
మరోవైపు అగ్నిప్రమాద బాధితులను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు. కాలిపోయిన భవనంతో పాటు చుట్టుపక్కల పరిసరాలను ఆయన పరిశీలించారు. సహాయకచర్యలపై అగ్నిమాపక, పోలీసు అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.




