Monday, 2 November 2026

సినీ భీష్మ కె.రాఘవ కన్నుమూత

105 ఏళ్ల వయసులో గుండెపోటుతో మృతి

ఎందరో ప్రముఖలను చిత్ర పరిశ్రమకు అందించిన ఘనుడు

హైదరాబాద్‌,జూలై31(జ‌నం సాక్షి ): సినీ భీష్ముడిగా పేరుగాంచిన ప్రముఖ సినీ నిర్మాత కోటిపల్లి రాఘవ ఇకలేరు. జూబ్లీహిల్స్‌ లోని ఆయన నివాసంలో గుండెపోటుతో కన్నుమూశారు. 1913 డిసెంబర్‌ 9న జన్మించిన కే.రాఘవది తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి గ్రామం. అనారోగ్యంతో జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 105 ఏళ్లు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సవిూపంలోని కోటిపల్లి అనే గ్రామంలో 1913లో ఆయన జన్మించారు. జీవితంలో అంచెలంచెలుగా ఎదిగిన రాఘవ అనేక చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తొలి తెలుగు సినిమా 1931లో నిర్మాణం జరుపుకోగా అంతకు ముందే ఆయన సినీరంగంలో అడుగుపెట్టారు. కొల్‌కతాలో సినిమా షూటింగ్‌లలో ట్రాలీ పుల్లర్‌గా సినీ జీవితాన్ని ప్రారంభించిన రాఘవ ఎన్నో అద్భుత చిత్రాలకు నిర్మాతగా ఎదిగారు. సినిమా రంగంలో చోటు చేసుకున్న అన్ని మార్పులను ఆయన దగ్గరుండి చూశారు. ఎనిమిదేళ్ల వయసులో తండ్రితో గొడవ పడి కొల్‌కతా వెళ్లిపోయిన రాఘవ, సైలెంట్‌ పిక్చర్స్‌లో ట్రాలీపుల్లర్‌గా చేరారు. తరువాత విజయవాడలోని మారుతి టాకీస్‌లో కొంత కాలం పనిచేశారు. తెలుగు సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య ఆఫీస్‌లో బాయ్‌గానూ కొంతకాలం పనిచేశారు. మిర్జాపురం రాజా వారుసినీ నిర్మాణంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఆయనకు సహాయకుడిగా చేరారు. రాజా వారి నిర్మాణంలో తెరకెక్కిన పల్నాటి యుద్ధం సినిమా క్లైమాక్స్‌ దశలో చిత్ర దర్శకుడు మరణించటంతో ఎల్వీ ప్రసాద్‌కు తొలిసారిగా దర్శకుడిగా అవకావం ఇప్పించారు. పాతాలభైరవి సినిమాలోని పోరాట సన్నివేశాలకు స్టంట్‌ డైరెక్టర్‌గానూ పనిచేశారు. తరువాత కొంత కాలం ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ గా పనిచేసిన రాఘవ నిర్మాతగా మారారు. సినీ శిఖరంగా ఎదిగిన ఆయన ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు.

సుఖదుఃఖాలు, జగత్‌ కిలాడీలు, తాత మనవడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చదువు సంస్కారం, అంతులేని వింతకథ, అంకితం, ఈ ప్రశ్నకు బదులేదీ వంటి అనేక చిత్రాలను నిర్మించడంతో పాటు బాలనాగమ్మ, చంద్రలేఖ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన ప్రతాప్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్‌పై 30కి పైగా సినిమాలకు నిర్మాతగా వ్యహరించారు. తరంగిణి, తూర్పు పడమర వంటి పలు చిత్రాలు అందించిన రాఘవ.. 1972లో తాతమనవడు, 1973లో సంసారం సాగరం సినిమాలకు నంది అవార్డు అందుకున్నారు. అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, 2012లో రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డు సైతం అందుకున్నారు. సినీ దిగ్గజాలైన దాసరి నారాయణరావు, రావుగోపాల్‌రావు, కోడి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, ఎస్పీ బాలు, సుమన్‌, భానుచందర్‌లను సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.