Tuesday, 3 November 2026

సివిల్స్‌ ఇంటర్వ్యూలు ఫెయిల్‌ అభ్యర్థులకు శుభవార్త 

తదుపరి ఉద్యోగాల్లో ప్రాధాన్యం కోసం ప్రతిపాదనలు
కేంద్రం ఆమోదిస్తే ఎందరికో ఊరట
హైదరాబాద్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసి, ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఫెయిలైన వారికి
ఊరట కలిగించేలా యూపీఎస్పీ నిర్ణయం తీసుకోబోతంది. మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్వ్యూ వరకు వెళ్లి అక్కడ ఉత్తీర్ణత సాధించని అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వంలో ఇతర ఉద్యోగాలు దక్కేలా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తాజాగా ఓ ప్రతిపాదన చేసింది. సివిల్‌ సర్వీస్‌ ఇంటర్వ్యూల్లో ఫెయిలైన అభ్యర్థులందరినీ ఏదో ఒక ఉద్యోగంలోకి తీసుకోవాలని కేంద్రానికి యూపీఎస్సీ సిఫారసు చేసింది.కేంద్రం దీనిని ఆమోదిస్తే  ఎందరో అభ్యర్థులకు ఊరట దక్కనుంది. వారు కూడా తదుపరి ఉద్యోగాల్లో చేరడం ఖాయం కానుంది. యూపీఎస్పీ సిఫారసును కేంద్రం ఆమోదిస్తే.. సివిల్స్‌ ఆశావహులకు కొంత ఊరట లభించినట్లు అవుతోంది.  భువనేశ్వర్‌లో ఈ మధ్య వివిధ రాష్ట్రాల  పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ల చైర్మన్ల సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న యూపీఎస్సీ ఛైర్మన్‌ అరవింద్‌ సక్సేనా ఈ ప్రతిపాదన గురించి వివరించారు. సివిల్స్‌లో ఇంటర్య్వూల వరకూ వచ్చిన ఉత్తీర్ణత సాధించని వారిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని సిబ్బంది వ్యవహారాల శాఖకు, వివిధ మంత్రిత్వ శాఖలకూ లేఖలు రాశామని సక్సేనా చెప్పారు. ప్రతీ ఏడాది సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు దేశవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నప్పటికీ అందరూ అర్హత సాధించలేకపోతున్నారు. లక్షలాది మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌ రాస్తున్నప్పటికీ.. మెయిన్స్‌ కు వచ్చే సరికి ఆ సంఖ్య 40 శాతానికి తగ్గిపోతోందని సక్సేనా వెల్లడించారు. మెయిన్స్‌దాటి ఇంటర్వ్యూకి వచ్చే సరికి ఆ సంఖ్య కాస్త 10-20 శాతానికి పడిపోతోంది అని తెలిపారు. 2018 సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు దేశ వ్యాప్తంగా 8లక్షల మంది దరఖాస్తు చేయగా వీరిలో కేవలం 10,500 మంది అభ్యర్థులు మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధించారు. వీరి నుంచి కేవలం 2వేల మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. కానీ నోటిఫికేషన్‌లో ఉన్న ఖాళీల సంఖ్య 782 మాత్రమే. దీంతో 1200 మంది ఇంటర్వ్యూల్లో ఫెయిలై వెనుదిరుగుతున్నారు. సివిల్స్‌లో ఇంటర్వ్యూ వరకూ వచ్చారంటే ఆ అభ్యర్థిని సమర్ధుడిగానే పరిగణిస్తారు. కాబట్టి ప్రతిభ ఉన్న ఇలాంటి వారందరినీ ఎందుకు వదిలేయడం? దేశానికి ఇలాంటి వారూ కావాలి. కనుక వీరి సేవల్ని వినియోగించుకోవాలి.. కేంద్ర ప్రభుత్వంలో ఏదో ఒక ఉద్యోగం ఇవ్వాలని యూపీఎస్సీ నిర్ణయించి కేంద్రానికి సిఫారసు చేసినట్లు అరవింద్‌ సక్సేనా చెప్పారు. ఇక యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్‌ రాసిన వారందరి మార్కులను ఆన్‌ లైన్‌? లో పెట్టాలని నిర్ణయించింది. దీని వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతాయని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపిక కానీ వారందరికీ ప్రయివేటు ఉద్యోగమే దిక్కవుతోంది. ప్రయివేటు సంస్థలు ఈ డాటాను వాడుకోని వారి ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందని తెలిపింది.