విశాఖపట్నం, ఏప్రిల్ 19(జనంసాక్షి) : సిపిఎం నూతన ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య ప్రకాశ్ కరత్ నూతన కార్యదర్శి పేరును ప్రకటించారు. కరత్ ప్రకటన సమయంలో ఇంక్విలాబ్ జిందాబాద్. మార్క్సిజం, లెనినిజం వర్థిలాల్లి, సోషలిజం సాధిస్తాం అన్న నినాదాలతో సమావేశమందిరం మారుమ్రోగింది. సమావేశానికి హాజరైన ప్రతినిధులు తొలుత 91 మందితో కేంద్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత కేంద్ర కమిటీ సమావేశమై నూతన కార్యదర్శిగా సీతారాం ఏచూరిని ఏకగ్రీవంగా ఎన్నుకుందని ప్రకాశ్ కరత్ ప్రకటించారు. అనంతరం నూతన ప్రధాన కార్యదర్శి 16 మందితో పొలిట్ బ్యూరోను ప్రకటించారు. నూతన పొలిట్ బ్యూరో ప్రకటన సందర్భంగానూ సమావేశమందిరం హర్షధ్వానాలతో మారుమ్రోగింది, పొలిట్ బ్యూరోలో నలుగురు, కేంద్ర కమిటీలో 17 మంది కొత్తసభ్యులు ఉన్నారు. పొలిట్‌బ్యూరోలో ఇద్దరు మహిళలు, కేంద్ర కమిటీలో 14 మంది మహిళలు ఉన్నారు. వీరిలో పొలిట్‌బ్యూరోలోకి సుభాషిణి ఆలీ, కేంద్ర కమిటీలోకి మినోతి ఘోష్, అంజుకర్, జగ్మతి సంగ్వాన్ కొత్తగా ఎన్నికైనారు. ఐదుగురు సీనియర్ సభ్యులను ప్రత్యేక ఆహ్వానితులుగా, మరో ఐదుగురి శాశ్వత ఆహ్వానితులుగా మహాసభ ఎన్నుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ నుండి బివి రాఘవులు పొలిట్‌బ్యూరోలో కొనసాగుతున్నారు. కేంద్ర కమిటీలో పాటూరు రామయ్య, పెనుమల్లి మధు,. ఎంఏ గఫూర్, ఎస్ పుణ్యవతి., వి. శ్రీనివాసరావు కేంద్రకమిటీ సభ్యులుగా తిరిగి ఎన్నికైనారు. తెలంగాణ రాష్ట్రం నుండి తమ్మినేని వీరభద్రం, ఎస్ వీరయ్య తిరిగి ఎన్నికకాగా, ఇప్పటి వరకు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఉన్న చెరుపల్లి సీతారాములు తాజా మహాసభలో నూతనంగా కేంద్ర కమిటికి ఎన్నికైనారు. ప్రత్యేక ఆహ్వానితురాలిగా తెలంగాణ నుండి మల్లుస్వరాజ్యంకు స్థానం లభించింది.
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏచూరి





