కడప,నవంబర్3(జనంసాక్షి): రాయలసీమ వ్యాప్తంగా నెలకొన్న భయానక కరువును నివారించ వలసిన ప్రభుత్వం కరువు నివారణ చర్యలు చేపట్టకుండా రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అందుకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 12న కరువుపై ఆందోళన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు శివకుమార్ అన్నారు. శనివారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వరుస కరువులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇంతవరకు ప్రభుత్వం కరువు నివారణ చర్యలను చేపట్టలేదని వారు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ఒక ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని, పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు విడుదల చేస్తాం అన్న చంద్రబాబు సంవత్సర కాలంలో ఎంత నీటిని రాయలసీమకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి షరీఫ్, కమిటీ సభ్యులు సుబ్బరాయుడు, రాజా, లక్ష్మీ దేవి, లక్ష్మయ్య, విజయ పాల్గొన్నారు.




