Thursday, 5 November 2026

సీమ రైతు సమస్యలపై చిన్నచూపు

సీమ రైతు సమస్యలపై చిన్నచూపు

ఎంతసేపు అమరావతి, పోలవరమేనా?

 

కడప,నవంబర్‌12(జ‌నంసాక్షి): తెలుగుదేశం ప్రభుత్వానికి అమరావతి, పోలవరం తప్ప రైతాంగ సమస్యలు పట్టవా అని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శివకుమార్‌ ప్రశ్నించారు. కరువు నివారణ చర్యలు చేపట్టాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మైదుకూరు పట్టణంలోని అంకాలమ్మ దేవాలయం నుండి స్థానిక కృష్ణ దేవరాయల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారం చేపట్టారు. ఎండిపోయిన వరి, పసుపు ,మొక్కజన్న పైర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శివకుమార్‌ మాట్లాడుతూ.. కడప జిల్లాలో వరుస కరువులతో రైతులు కరువు కోరల్లో చిక్కి కొట్టుమిట్టాడుతుంటే రైతాంగాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. కడప జిల్లాలో లక్ష 33 వేల ఎకరాల్లో వరి, వేరుశనగ, ఉల్లి, కంది, పత్తి తదితర పంటలు తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల వేసిన పంటలు వేసినట్లుగానే ఎండిపోతున్నాయని, పెట్టిన పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరులా పోతుంటే రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు.

కృష్ణాపురం ఉల్లి, పసుపు పంటలకు మద్దతు ధర కోసం కేసీ కెనాల్‌ నీటి కోసం ప్రతి సంవత్సరం రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుందంటే ప్రభుత్వం రైతాంగం పట్ల చూపిస్తున్న ప్రేమ ఏపాటిదో అర్థమవు తుందన్నారు. తక్షణమే జిల్లాలో కరువు నివారణా చర్యలు చేపట్టి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని మిగిలిన రుణమాఫీ విడుదలను రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని శాశ్వత కరువు నివారణ చర్యల్లో భాగంగా పెండింగ్‌ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల మేరకు ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర ప్రకటించాలని మైదుకూరు ప్రాంతంలో కేపీ ఉల్లికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, కేసీ కెనాల్‌ రైతులకు శాశ్వత పరిష్కారంలో భాగంగా రాజోలు రిజర్వాయర్‌ పనులను ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌ఎం.షరీఫ్‌, సుబ్బారాయుడు, రాజా, లక్ష్మయ్య, లక్ష్మీదేవి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు సునీల్‌, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.