Friday, 6 November 2026

సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించండి

– కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ

– కూకట్‌పల్లి నియోజకవర్గ మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్‌, నవంబర్‌27(జ‌నంసాక్షి): ప్రజాసేవకు నందమూరి వంశం నుంచి సుహాసిని వస్తున్నారని, అత్యధిక మెజారిటీతో ఆమెను గెలింపించి ఆశీర్వదించాలని కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ కోరారు. కూకట్‌పల్లి తెదేపా కార్యాలయంలో స్థానిక మేనిఫెస్టో విడుదల కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్వే సత్యనారాయణ, కూకట్‌పల్లి తెదేపా అభ్యర్థి సుహాసిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్వే మాట్లాడుతూ స్థానిక ప్రజలకు సుహాసిని అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని చెప్పారు. పేదలను ఆదుకునే పార్టీలన్నీ కలిసి పోటీచేస్తున్నాయని, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్లని ఎన్నుకోవాలని కోరారు. సుహాసినిపై పలు పార్టీలు దుష్పచ్రారం చేస్తున్నాయని సర్వే మండిపడ్డారు. గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండరని ప్రచారం చేస్తున్నారని, దీన్ని ప్రజలెవరూ నమ్మొద్దని కోరారు. కూకట్‌పల్లిలోనే సుహాసిని ఇల్లు తీసుకున్నారని, ప్రజాసేవ కోసం ఆమె ఇక్కడే ఉంటారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తానన్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హావిూలన్నీ నెరవేరుస్తానని చెప్పారు. తాను అందుబాటులో ఉండనని చేస్తున్న ప్రచారం అబద్ధమని, ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని సువాసిని పేర్కొన్నారు. తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సుహాసిని కోరారు.