సౌర విద్యుత్‌తో తీరనున్న అవసరాలు 

గృహవిద్యుత్‌కు ఛార్జీలపై ప్రభావం
అనంతపురం,మే18(జ‌నం సాక్షి ): సౌర విద్యుత్‌ అందుబాటులోకి వస్తే ఆ విద్యుత్‌ను గృహ వినియోగానికి అధికంగా కేటాయించి ఇతర రంగాల నుంచి వచ్చే విద్యుత్‌ను పారిశ్రామిక రంగాలకు కేటాయించడం ద్వారా పారిశ్రామికరంగాన్ని బలోపేతం చేసేందుకు కసరత్తుచేస్తున్నారు. దీంతో గృహ వినియోగ విద్యుత్‌ చార్జీల ప్రభావం ప్రజలపై తగ్గిస్తారని భావిస్తున్నారు. సౌరశక్తి కేంద్రాల నిర్మాణం పూర్తయ్యాక విద్యుత్‌ చార్జీల తగ్గింపుపై ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు.  2018 డిసెంబర్‌ నాటికి విద్యుత్‌ చార్జీలు తగ్గించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని నిపుణులు అంటున్నారు. ఇక జల విద్యుత్‌ ఉత్పత్తిని సైతం తగ్గించి శ్రీశైలం నుంచి రాయలసీమ, నాగార్జునసాగర్‌ నుంచి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు ఇప్పుడున్న అందిస్తున్న దాని కంటే ఎక్కువగా అందించే అవకాశముందని అంటున్నారు. దీంతో ప్రజల్లో చంద్రబాబుపై విశ్వాసం పెరిగి మరో మారు అధికారాన్ని అందిస్తారని టిడిపికి చెందిన మేథావులు పేర్కొంటున్నారు. మొత్తం విూద సౌరశక్తి ఇటు ప్రజలపై భారాన్ని తగ్గించడమేగాక, అటు చంద్రబాబును అధికారానికి దూరం కాకుండా చూస్తుందని వారు అంచనా వేస్తున్నారు.సోలార్‌ ఎనర్జీతో  కరెంట్‌  ఉత్పత్తి
పూర్తిస్థాయిలో చేపట్టిన అనంతరం చార్జీలు గణనీయంగా తగ్గనున్నాయని భావిస్తున్నారు.  ఇంతకాలం ప్రతి రెండేళ్లకు ఒకసారి విద్యుత్‌ చార్జీల పెంపుతో విసిగిపోయిన ప్రజలకు రానున్న రెండేళ్లలో ఉపశమనం లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశలో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కర్నూలు, అనంతలో నిర్మాణంలో ఉన్న అతి పెద్ద సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం పనులు పూర్తయి సౌరశక్తి అందుబాటులోకి వస్తే విద్యుత్‌ డిమాండ్‌ పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చనుందని భావిస్తున్నారు. కర్నూలులో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి లక్ష్యం కాగా రానున్న రెండేళ్లలో అనంతపురం, కడప జిల్లాల్లో నెలకొల్పే సౌర విద్యుత్‌ కేంద్రాల ద్వారా మరో నాలుగు వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ అందుబాటులోకి వస్తుంది. కర్నూలులో పనులు తుది దశకు చేరుకున్నాయి. మరో మూడునెలల్లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని అధికారులు అంటున్నారు. సౌర విద్యుత్‌ ఉత్పత్తికి అయ్యే ఖర్చు ఇతర విద్యుత్‌ ఉత్పత్తి రంగాల కన్నా అతి తక్కువగా ఉండడంతో పారిశ్రామిక  అవసరాలు తీరనున్నాయి.