Friday, 6 November 2026

స్కూళ్లు తెరిచేలోగా పాఠ్యపుస్తకాల పంపిణీ

చురకుగా సాగుతున్న పుస్తకాల చేరివేత
జిల్లాలకు చేరుతున్న పుస్తకాలు
హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి): ప్రభుత్వం సర్కారు బడుల్లో అన్ని మాధ్యమాల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులందరికి పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేస్తోంది. బడులు తెరిచిన రోజే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు అందించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ పంపిణీ పక్రియ ప్రారంభించింది. మార్చి నెల రెండో పక్షం నుంచి హైదరాబాద్‌ ప్రధాన గోదాం నుంచి పుస్తకాల సరఫరా ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని ప్రధాన గోదాం నుంచి మెదక్‌లోని జిల్లా గోదాంకు చేరిన పుస్తకాలను మండల వనరుల కేంద్రాలకు తరలిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి పాఠశాల విద్యాశాఖ ముందస్తు గానే పాఠ్యపుస్తకాల ముద్రణ, వెంటనే జిల్లాలకు తరలింపు పక్రియను చేపట్టింది. జిల్లా విద్యాశాఖాధికారులు సైతం సకాలంలో పాఠశాలలకు పుస్తకాలు చేరవేసేలా చర్యలు తీసుకుంటున్నారు. జూన్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరానికి సరిపడా పాఠ్య పుస్తకాలు పంపిణీ అవుతున్నాయి. పుస్తకాల పంపిణీ సక్రమంగా, పారదర్శకంగా జరిగేందుకు విద్యాశాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఒక్క పుస్తకం కూడా పక్కదారి పట్టకుండా ఈసారి ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటోంది. పంపిణీ అవుతున్న ప్రతీ బుక్కుకు లెక్క పక్కాగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ పుస్తకంపై ఉండే కోడ్‌ నంబర్‌ను విద్యార్థి ఆధార్‌ నెంబర్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఫలితంగా పుస్తకం ఎక్కడున్నా నెంబర్‌ ఆధారంగా అది ఏ విద్యార్థికి సంబంధించినదో సులభంగా గుర్తించవచ్చు.  పాఠశాలల పునఃప్రారంభానికి మరో పది రోజుల గడువు మాత్రమే ఉండగా గత శనివారం నుంచి జిల్లా కేంద్రాల నుంచి మండల వనరుల కేంద్రాలకు పుస్తకాల సరఫరా ప్రారంభించారు.  మండల వనరులకేంద్రాలకు చేరిన పుస్తకాలను  మండలపరిధిలోని అన్ని పాఠశాలలకు పంపిణీ చేయాల్సిన బాధ్యత మండల విద్యాధి కారులదే. ఆయా పాఠశాలల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వారు పుస్తకాలను పంపిణీ చేస్తారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి అన్ని తరగతులు, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు దాదాపు జిల్లాకు చేరడం వల్ల బడులు తెరిచే రోజు విద్యార్థులందరికి వాటిని అందించే అవకాశం ఉంది.  ప్రభుత్వం ప్రతీ ఏడాది విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తున్నా క్షేత్రస్థాయిలో పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయి. పంపిణీ చేసిన కొద్ది రోజులకే మార్కెట్‌లోని కొన్ని దుకాణాల్లో దర్శమిచ్చేవి. కొన్నిచోట్ల ప్రైవేట్‌ పాఠశాలల్లోనూ విక్రయించేవారు. విద్యారంగంలో కీలక మార్పులు, ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం పాఠ్య పుస్తకాల పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నడుంబిగించింది. పక్కదారి పట్టకుండా ప్రతి పాఠ్య పుస్తకంపైనా కోడ్‌ నంబర్‌ను ముద్రించి దాన్ని విద్యార్థి ఆధార్‌ సంఖ్యకు అనుసంధానం చేసింది. దీంతో బయట ఎక్కడైనా ఉచిత పాఠ్య పుస్తకం కనిపిస్తే ఆధార్‌ సాయంతోఅది ఏ విద్యార్థికి చెందిందో గుర్తిస్తారు. ఈ విధానం వల్ల ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీలో అవకతవకలకు చెక్‌ పడనుంది. ఈమేరకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీకి ఆధార్‌ తప్పనిసరి కావడంతో ఆధార్‌ కార్డు లేని విద్యార్థుల పేర్లు నమోదు చేసేందుకు జిల్లాకు ఆధార్‌ కిట్లను కూడా అందజేశారు. జనగామ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు 2,67,900 పుస్తకాలు అవసరమని విద్యాశాఖ ప్రభుత్వానికి ఇండెంట్‌ దాఖలు చేస్తే ఇప్పటి వరకు జిల్లాకు 2లక్షల 5వేల పుస్తకాలు అందగా వాటిలో లక్షా 32వేల పుస్తకాలను ఇప్పటికే మండలాల ఎమ్మార్సీలకు పంపిణీ చేశారు. మిగిలిన అన్ని పుస్తకాలు పాఠశాలలు తెరిచే లోపునే పంపిణీ చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్‌.యాదయ్య తెలిపారు. మెదక్‌ జిల్లాలోని 20 మండలాల పరిధిలో 645 ప్రాథమిక, 133 ప్రాథమికోన్నత, 215 ఉన్నత, 15 కస్తూర్బాగాంధీ, 7 ఆదర్శ, 16 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. 95 వేల మంది విద్యార్థులు చదువుకుం టున్నారు. మండల విద్యాశాఖాధికారుల నుంచి అందిన ప్రతిపాదనల ప్రకారం 2018-19 విద్యా సంవత్సరంలో జిల్లాలోని ఆయా పాఠశాలలన్నింటిలో చదువుకునే విద్యార్థులకు అన్ని సబ్జెక్టులవి కలిపి మొత్తం 5,58,065 పాఠ్యపుస్తకాలు అవసరం ఉన్నాయి. మెదక్‌లోని జిల్లా గోదాంలో గతేడాది పంపిణీ చేయగా 40,275 మిగిలాయి. ఇవి పోను 5,17,790 పాఠ్యపుస్తకాల కోసం ప్రతిపాదనలు పంపారు.  ఇప్పటివరకు 4,82,954 పుస్తకాలు మెదక్‌ గోదాంకు చేరాయి. వీటితో కలిపి మొత్తం 5,23,229 అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు రెండు లారీల చొప్పున తరలిస్తున్నారు. ఇప్పటి వరకు నాలుగు లారీల పుస్తకాలు తరలించగా మరో వారం రోజుల్లో జిల్లాలోని అన్ని మండలాలకు సరఫరా పూర్తి చేస్తామని జిల్లా పాఠ్యపుస్తక విక్రయ కేంద్రం మేనేజర్‌ లక్ష్మీనర్సింహాగౌడ్‌ తెలిపారు.
విద్యార్థులకు యూనిఫామ్‌
విద్యార్థులకు ఈసారి జూన్‌ 1కి ముందే యూనిఫామ్స్‌ అందనున్నాయి గతంలో పాఠశాలలు ప్రారంభమైన తర్వాత అం దేవి. కొన్ని పొట్టిగా, మరికొన్ని పొడుగ్గా సైజుల్లో తేడాలు రావడంతో చాలామంది విద్యార్థులు వాటిని ధరించి వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. దీంతో రెండేళ్లుగా గ్రామ పరిధిలోని దర్జీలే కుట్టి సరఫరా చేస్తున్నారు. ఈబాధ్యతలు పూర్తిగా స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ(ఎస్‌ఎంసీ)లకు అప్పగించారు. దీంతో యథావిధిగా యూనిఫామ్స్‌ అందుతున్నాయి. అయితే ఈసారి పాఠశాలలు ప్రారంభానికి ముందే యూనిఫారాలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనికి సంబంధించిన వస్త్రాన్ని ముందుగానే జిల్లా కేంద్రానికి పంపి అక్కడి నుంచి మండలాలకు పంపారు. విద్యార్థుల కొలతలు తీసుకొని మే 31 నాటికి ప్రతీ పాఠశాలలో యూనిఫామ్‌ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీల ఆధ్వర్యంలోనే స్థానికంగా ఉండే దర్జీలతోనే కుట్టించాలని ఆదేశాలు జారీ చేయడంతోపాటు చాలాచోట్ల ఈ అంశంపై అంతగా దృష్టి పెట్టక పోవడంతో సమయానికి దుస్తులు అందలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి వేసవి సెలవుల్లోనే కుట్టించి పాఠశాలలు ప్రారంభం కాగానే అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్‌ ఉచితంగా అందజేస్తారు. కాగా, 1నుంచి 8వ తరగతి విద్యార్థులకు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో దుస్తులు సమకూరుస్తున్నారు. ఈసారి నుంచి 9, 10వ తరగతుల విద్యార్థులకు సైతం దుస్తులు అందజేయాలని ప్రభుత్వం సూతప్రాయంగా నిర్ణయించింది.