Friday, 6 November 2026

స్నాచింగ్‌ ముఠా కోసం ముమ్మర గాలింపు

అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన
హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి ):  స్నాచింగ్‌లు చేసేందుకు నగరంలోకి అంతర్రాష్ట్ర దొంగల ముఠా ప్రవేశించిందన్న వార్తలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. యాక్సిస్‌ బ్యాంకు నుంచి రూ. 2.1 లక్షలు డ్రా చేసుకొని ఇంటికి వెళ్తుండగా తార్నాక ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు పద్మ, నర్సింగ్‌రావుల నుంచి బంజారాహిల్స్‌ రోడ్డు నెం.1లో బ్లాక్‌ పల్సర్‌పై వచ్చిన దుండగులు వారి చేతిలోని బ్యాగ్‌ను లాక్కొని పరారయ్యారు. వారం రోజుల క్రితం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనను నగర పోలీసులు చాలెంజ్‌గా తీసుకున్నారు. బాధితులు వచ్చిన రూట్‌ను, దుండగులు వెళ్లే రూట్‌ను అంచనా వేసి ఘటనపై నగర టాస్క్‌ఫోర్స్‌ బృందాలు సీసీ కెమెరాల ఫుటేజీలను విశ్లేషించాయి. ఇందులో బ్యాగ్‌ లాక్కొని పరారయిన దుండగులతో పాటు వారి వెంటనే మరో వాహనంపై మరో ఇద్దరు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్నాచింగ్‌ చేసేందుకు ప్రత్యేకంగా నలుగురు సభ్యులున్న గ్యాంగ్‌ నగరంలోకి ప్రవేశించినట్లు పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఈ ముఠా నగరంలో ఎక్కడెక్కడ తిరిగిందనే విషయాన్ని సీసీ ఫుటేజీలను విశ్లేషిస్తూ ఆరా తీశారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సవిూపంలో ఈ నలుగురు ఒక లాడ్జీ వద్ద ఉన్న దృశ్యాలను పోలీసులు గుర్తించారు. నగరంలో దోపిడీ, స్నాచింగ్‌లు చేసేందుకే ఈ దొంగల ముఠా నగరానికి వచ్చి, సికింద్రాబాద్‌లో లాడ్జీలో బస చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ గ్యాంగ్‌ కోసం టాస్క్‌ఫోర్స్‌ బృందాలు గాలింపు చేపట్టాయి. స్నాచింగ్‌కు పాల్పడిన నలుగురు సభ్యుల గ్యాంగ్‌లో ఇద్దరు బంగారు ఆభరణాలతో రైల్లో పరారు కాగా, మరో ఇద్దరు వాహనాలపై రోడ్డు మార్గాన నగారాన్ని దాటి వెళ్లిపోయినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చి ఈ ముఠా కోసం గాలింపు చేపట్టారు.
—