Tuesday, 3 November 2026

స్వరాష్ట్రంలో వలసవాద దురహంకారం

5
శంషాబాద్‌ డొమెస్టిక్‌ టర్మినల్‌కు ఎన్టీఆర్‌ పేరు

ఇది తెలంగాణపై ఆంధ్రా పెత్తనానికి చిహ్నం

సీమాంధ్ర పార్టీల్లో తెలంగాణ నేతల బానిస బతుకులు

తెలంగాణలో ఉంటూ.. ఆంధ్రా పార్టీలకు వంతపాట

రాష్ట్రం విడిపోయినా తీరుమార్చుకోని సీమాంధ్రులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పేరు మార్పుపై ‘జనంసాక్షి’ ప్రత్యేక కథనం

హైదరాబాద్‌, నవంబర్‌ 21 (జనంసాక్షి) : ‘మీది తెలుగే.. మాది తెలుగే’ అంటూ సీమాంధ్రులు తెలంగాణ గడ్డపై 60 క్రితం రాబంధుల్లా వాలారు. నిజానికి రాబంధులకు ఒక నీతి ఉంటుంది. సచ్చిన కళేభరాలను మాత్రమే తింటాయి. కానీ.. ఈ సీమాంధ్ర నీచరాబంధులు మాత్రం బతికున్న తెలంగాణ బిడ్డల్ని పీక్కుతిన్నాయి. ఆత్మ గౌరవం.. స్వరాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలోనూ వీరి చీడపీడ విరగడైతలేదు. అంతేకాదు.. ఈ ఆంధ్రా రాబంధుల ఆగడాలను ఇంకా వర్ణించాలంటే… రక్తం.. ఎరుపు రంగును పోలి ఉండడం ఎంత నిజమో.. సీమాంధ్రులది.. దోచుకుని దాసుకునే స్వభావమనేది కూడా అంతే నిజం. ఇది నాణానికి ఒక వైపు మాత్రమే. ఇక రెండోవైపు చూస్తే.. పెత్తనం.. దురహంకారం.. అనేవి సీమాంధ్రులకు రెండు కళ్లలాంటివి. ఆ కళ్లు మనిషి బతికున్నంతకాలం బాసిల్లుతాయి. అలాగే ఆంధ్రాపాలకుల్లోని పెత్తనం, దురహంకారం అనేవి కూడా వారున్నంతకాలం వర్థిల్లుతాయి. అందుకు.. రాష్ట్ర విభజన అనంతరం రెండు రాష్ట్రాల మధ్య తలెత్తుతున్న వివాదాలు, ఆంధ్రా పాలకులు చేసే కుట్రలే నిదర్శనం. ఆ కుట్రల్లో భాగమే.. ప్రస్తుతం శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరు మార్పు అంశం తెరమీదకొచ్చింది. దానికి స్వర్గీయ ఎన్టీరామారావు పేరుపెట్టాలని సీమాంధ్ర పార్టీ నాయకుల పేచీ. అందుకు.. తెలంగాణలో సీమాంధ్ర పార్టీల జెండాలు మోస్తున్న కొందరు ప్రజాప్రతినిధులు వంతపాడడం.. వారి పెత్తననానికి దాసోహమనడం విడ్డూరం.

ఎన్టీఆర్‌ హయాంలోనే తెలంగాణపై వివక్ష మొదలైంది…

స్వర్గీయ ఎన్టీరామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ ప్రాంతం,  ఇక్కడి ప్రజలపై వివక్ష మొదలైంది. ఆయన కాలంలో నిర్మించిన తెలుగుగంగ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజానీకానికి ఒనగూరిన ప్రయోజనాలు శూన్యం. ఇది కేవలం మద్రాసుకు నీళ్లు తీసుకెళ్లడానికి నిర్మించిన ప్రాజెక్టుగా విమర్శలొచ్చాయి. అంతేకాదు.. అప్పట్లో తెలంగాణలో స్థాపించాల్సిన తెలుగుయూనివర్శిటీని విజయవాడకు తరలించారు. దీంతో ఇక్కడి విద్యార్థులకు విద్యావకాశాలు తగ్గించారు. ఇలా అధికారం చేతుల్లో ఉందనే భావనతో తాము అనుకున్నదల్లా ఆంధ్రా ప్రాంతానికి తరలించారు. అక్కడి ప్రాంతం అభివృద్ధికే పెద్దపీట వేసి తెలంగాణను విస్మరించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులకు రాజకీయంగా కూడా తగిన ప్రాధాన్యత దక్కలేదు. కీలక బాధ్యతల్లో సీమాంధ్ర నాయకులదే పెత్తనం. ఆ పాపానికే.. తెలంగాణలో సమర్థవంతమైన రాజకీయ నాయకులున్నా ఎదగలేకపోయారు. సీమాంధ్రుల అధికార ధాటికి తెలంగాణ నాయకులు గుర్తింపును కోల్పోయారు.

ఎన్టీఆర్‌ పేరు.. తెలంగాణపై పెత్తనానికి చిహ్నం…

రాష్ట్రం విడిపోయినా.. సీమాంధ్రుల పెత్తనం రోజుకోరూపంలో తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోంది. అనవసర విషయాలను తెరమీదకు తెచ్చి.. తెలంగాణ అభివృద్ధికి మోకాలడ్డుతున్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొడుతున్నారు. నిన్నమొన్నటి వరకు ఆంధ్రా ప్రభుత్వం నేరుగా తెలంగాణ ప్రభుత్వానికి అడ్డుపడితే.. నేడు కేంద్రప్రభుత్వం రూపంలో మరోసారి తెలంగాణ ప్రజలపై పెత్తనానికి దిగుతున్నారు. అదెలాగంటే.. ఆంధ్రాప్రాంతానికి చెందిన ఓ పెద్దాయన, తెలుగుదేశం పార్టీ ఎంపి, చంద్రబాబును నమ్మినబంటు, ఎన్డీయే ప్రభుత్వంలో.. కేంద్ర కేబినెట్‌ మంత్రిగా కొనసాగుతున్నారు. పైగా కేంద్ర విమానయాన శాఖకు బాధ్యులుగా ఉన్నారు. ఆయనే.. అశోక్‌గజపతి రాజు. ఆయనగారి పుణ్యమా అని హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ప్రస్తుతం ఉన్న రాజీవ్‌గాంధీ పేరు మార్చి ఎన్టీరామారావు పేరును డొమెస్టిక్‌గా నామకరణం చేసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. ఈ ఎయిర్‌పోర్టు తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఉంది. దానికి తెలంగాణలోని ముఖ్యుల పేర్లు ప్రతిపాదించకుండా ఆంధ్రారాష్ట్రానికి చెందిన ఎన్టీఆర్‌ పేరును సిఫారసు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఏడు విమానాశ్రయాలున్నాయి. వాటిల్లో ఏఒక్కదానికైనా ఎన్టీఆర్‌ పేరు పెట్టుకోవచ్చు కదా..? అక్కడ కాకుండా తెలంగాణలో ఎందుకు పెట్టాలి..? అని తెలంగాణ ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. దీన్నిబట్టి… తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు సీమాంధ్ర పాలకులు మరోసారి ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని విమర్శిస్తున్నారు.

తెలంగాణలోని ఎయిర్‌పోర్టుకు ఆంధ్రుల పేర్లే వద్దు

శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్‌పేరును నామకరణం చేయాలన్న కేంద్రప్రభుత్వం సూచించిన విషయమై.. తెలంగాణ శాసనసభలో పెద్ద దుమారమే రేగింది. తెలంగాణలో ఉన్న విమానాశ్రయానికి ఆంధ్రా ప్రాంతానికి చెందిన నాయకుల పేర్లు ఎలా పెడతారని..? తెలంగాణలో సీమాంధ్ర పార్టీల జెండాలు మోస్తున్న ప్రజాప్రతినిధులు, అధికార పక్షం ప్రజాప్రతినిధుల మధ్య చర్చ వాడీవేడీగా జరిగింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు పేరు మార్చే అవసరం తప్పనిసరైతే తెలంగాణ ప్రాంతానికి చెందిన మాజీ ప్రధాని పివి.నర్సింహారావు పేరు లేదా ఆదివాసీల హక్కుల సాధన కోసం అమరుడైన కొమురం భీం పేరును పెట్టాలని.. లేకుంటే ప్రస్తుతం ఉన్న రాజీవ్‌గాంధీ పేరునే కొనసాగించాలని, ఇందుకు తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది.

ఆంధ్రా పార్టీలకు తెలంగాణ నాయకుల వంతపాట

తెలంగాణలో ఉంటూ.. తెలంగాణలో జీవిస్తూ.. పక్కరాష్ట్రం పార్టీల జెండాలను మోస్తున్నారు కొందరు తెలంగాణ రాజకీయ నాయకులు. అంతేకాదు.. వారు ఏది చెబితే దానికి వంతపాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా వారికి బానిసలుగా ఉంటూ సేవచేస్తున్నారు. ఆ పార్టీ అధినేతలకు దాసోహమవుతున్నారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి ఇక్కడి ప్రజల విలువలను వారి కుట్రలకు బలిచేస్తున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎన్టీఆర్‌ పేరు నామకరణం విషయమై తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు సమర్థించడం ఆంధ్రా పెత్తనానికి లొంగిపోవడాన్ని తెలియజేస్తోంది. తెలంగాణలో ఎందరో మహనీయులున్నా.. వారి పేర్లను ప్రస్తావించకపోవడం సీమాంధ్రుల ముందు వారి బానిసత్వాన్ని తేటతెల్లంచేస్తోంది. దీనిపై తెలంగాణ అసెంబ్లీలో అనవసరమైన చర్చకు తెరదీసి సభసమయాన్ని వృథా చేశారు. ఈ ధోరణి మంచికాదు.. రాష్ట్రం విడిపోయింది. ప్రస్తుతం పార్టీలు కాదు ముఖ్యం.. గతాన్ని కట్టిపెట్టి.. తెలంగాణ ప్రజల అభివృద్ధికి.. రాజకీయాలకతీతంగా ప్రజాప్రతినిధులందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని.. ముఖ్యంగా తెలంగాణలోని టిడిపి నాయకులు, ప్రజాప్రతినిధులు గుర్తెరగాలని ‘జనంసాక్షి’ కోరుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *