Thursday, 5 November 2026

స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణ

– ఆర్నెళ్లు అనుమతిలేకుండా నగరంలోకి ప్రవేశించొద్దంటూ పోలీసుల ఆదేశం
– తెల్లవారుజామున వాహనాల ద్వారా కాకినాడ తరలింపు
– శాంతిభద్రతలు కాపాడేందుకే ఈ నిర్ణయమన్న పోలీసులు
– ఎవరూ ఆందోళన చెందవద్దని స్వామి పరిపూర్ణానంద పిలుపు
హైదరాబాద్‌, జులై11(జ‌నం సాక్షి) : శ్రీరాముడిపై కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలకు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో జూబ్లీహిల్స్‌ గృహ నిర్బంధంలో ఉన్న ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కాకినాడ తరలించారు. అనుమతి లేకుండా నగరంలో ప్రవేశించొద్దని.. తమ ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు సందర్భాల్లో ఇతర మతాలపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఈ నిర్ణయం  తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వామి పరిపూర్ణాంద తరలింపులో తొలుత పోలీసులు చాకచక్యం ప్రదర్శించారు. నాలుగు వాహనాల్లో బయలు దేరిన పోలీసులు రెండు వాహనాలను విజయవాడ వైపు, మరో రెండు వాహనాలను శ్రీశైలం వైపు పంపించారు. ఈ రెండు
మార్గాల్లో ఆయన్ను ఎక్కడికి తరలించారనే విషయాన్నిపోలీసులు వెల్లడించలేదు. అధికారిక ప్రకటన అనంతరం కాకినాడలోని శ్రీపీఠానికి స్వామి పరిపూర్ణానందను తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఎవరూ ఆందోళన చెందవద్దు – పరిపూర్ణానంద
నగర బహిష్కరణ విధించడంపై స్వామి పరిపూర్ణానంద స్పందించారు. నగర బహిష్కరణపై అనుచరులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు. ధర్మం, న్యాయం రెండు కళ్ళుగా భావిస్తున్నానని, ధర్మాన్ని న్యాయం నిలబెడుతుందనే నమ్మకం తనకు ఉందని పరిపూర్ణానంద పేర్కొన్నారు. గత ఏడాది నవంబర్‌లో రాష్టీయ్ర హిందూసేన సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యల చేశారని నోటీసుల్లో పేర్కొన్నట్లు స్వామి పరిపూర్ణానంద న్యాయసలహాదారు పద్మారావు తెలిపారు.
పరిపూర్ణానంద బహిష్కరణను ఖండించిన కత్తి..
స్వామి పరిపూర్ణానంద నగర బహిష్కరణను కత్తి మహేష్‌ ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్లో పేర్కొన్నాడు. బహిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం కాదని, బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. మనుషుల్ని ‘తప్పిస్తే’ సమస్యలు తప్పుతాయి అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుందని పేర్కొన్నారు. సమన్యాయం విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన మాట వాస్తవమే అయినా.. అప్రజాస్వామికమైన నిర్ణయాలను తీసుకుంటే.. అది మొత్తం సమాజానికే మంచిది కాదంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు కత్తి మహేష్‌. వ్యవస్థ విధానాలను ఖండించాలన్నారు కత్తి సూచించారు. పరిపూర్ణనంద బహిష్కరణను ఖండించటంతో కత్తి మహేష్‌ పై నెటిజన్లు పాజిటివ్‌ గా స్పందిస్తున్నారు.
ఎంఐఎం నేతలను ఎందుకు బహిష్కరించలేదు? – లక్ష్మణ్‌
స్వామి పరిపూర్ణానందను నగరం నుంచి బహిష్కరించడమంటే హిందువులను బహిష్కరిచినట్టేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ పరిపూర్ణానంద బహిష్కరణ ప్రభుత్వం కుట్ర అని అన్నారు. బహిష్కరణ నిర్ణయంపై ప్రభుత్వం పునారలోచించుకోవాలని కోరారు. కోట్లాది ప్రజలు ఆరాధించే శ్రీరాముని నిందించిన వారిపై చర్యలు తీసుకోకపోవడం సరికాదని లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎవరి చేతిలో నడుస్తోందని ప్రశ్నించారు. హిందూ దేవతలను తూలనాడిన ఎంఐఎం నేతలను ఎందుకు బహిష్కరించలేదని నిలదీశారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని, వెంటనే స్వామి పరిపూర్ణానందపై బహిష్కరణ వేటును ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.