జమ్ము: పాకిస్థాన్ రేంజర్లు శుక్రవారం తెల్లవారుఝాము నుంచి మరోసారి కాల్పులకు తెగబడ్డారు. జమ్ముకశ్మీర్‌లోని నౌషేరా, సుందర్బని, పల్లన్‌వాలా సెక్టార్లలో విచక్షణరహితంగా కాల్పులు జరుపుతున్నారు. గత 12 గంటల్లో ఆరుసార్లు పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడింది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. తాజా కాల్పుల్లో ఒక బాలికకు గాయాలయ్యాయి. మన జవాన్లు పాక్‌కు దీటుగా స్పందిస్తున్నారు. ఈ కాల్పుల్లో ఒక పాక్ రేంజర్ హతమైనట్లు సమాచారం. పాక్ భారీగా కాల్పులకు పాల్పడుతుండటంతో సరిహద్దు గ్రామాల ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని బీఎస్ఎఫ్ సూచించింది. నిన్న సాయంత్రం నుంచి కేరి, హీరానగర్, మెంధార్, పూంచ్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరుపుతూనే ఉంది. దీంతో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. బీఎస్ఎఫ్ చీఫ్‌తో మాట్లాడి దీటుగా బదులివ్వాలని ఆదేశించారు.




