– పార్దివదేహానికి నివాళులర్పించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
– పలువురు రాజకీయ, సినీ ప్రముఖుల నివాళి
హైదరాబాద్, ఆగస్టు30(జనం సాక్షి) : మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే. కాగా ఆయన మృతదేహాన్ని గురువారం తన నివాసం వద్ద ఉంచారు. పలువరు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు హరికృష్ణ పార్దివ దేహం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు హరికృష్ణ పార్దివదేహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెదేపా సీనియర్ నేత హరికృష్ణ దుర్మరణం చాలా విచారకరమని బాధను వ్యక్తం చేశారు. హరికృష్ణ నిర్భీతిగా, నిక్కచ్చిగా, ముక్కుసూటిగా వ్యవహరించేవారని అన్నారు. ఏ పనైనా చిత్తుశుద్ధితో చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి హరికృష్ణ అని పేర్కొన్నారు. గతంలో రాజ్యసభలో తెలుగులోనే మాట్లాడుతానని గట్టిగా చెప్పారని..ఆనాటి ఛైర్మన్ అభ్యంతరం తెలిపితే తాను జోక్యం చేసుకుని తర్జుమా చేస్తానని చెప్పినట్లు వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. హరికృష్ణకు ప్రజాభిమానం మెండుగా ఉందని.. సినీ, రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకత సంతరించుకున్నారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. హరికృష్ణ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి. అదేవిధంగా తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్, సినీ నటుడు కోట శ్రీనివాస రావు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు నివాళులు అర్పించారు. అనంతరం డీఎస్ మాట్లాడుతూ.. హరికృష్ణ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరమన్నారు. ఆయన తనను చాలా అభిమానించేవారని తెలిపారు. ఆయన మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపించేదని గుర్తు చేసుకున్నారు. మంచి మిత్రుడుగా ఉండేవారని పేర్కొన్నారు. కోట శ్రీనివాస రావు మాట్లాడుతూ..హరికృష్ణతో నా అనుబంధం ఇప్పటిది కాదని తెలిపారు. ఆయన మరణం తీరని లోటని వ్యాఖ్యానించారు. సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ..హరికృష్ణ, తన నియోజకవర్గంలో ఎన్టీఆర్ విగ్రహ
ఆవిష్కరణకు వచ్చారని వెల్లడించారు. చంద్రబాబు బస్సు యాత్రలో, సత్తుపల్లిలో జరిగిన సమావేశాల్లో హరికృష్ణని కలిశానని గుర్తు చేసుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి హరికృష్ణ అని కొనియాడారు.
తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. చైతన్యరథంపై హరికృష్ణ వేల కిలోవిూటర్లు తిరిగారని, వేల కిలోవిూటర్లు తిరిగినా చైతన్య రథానికి ఎలాంటి ఘటనలు జరగలేదని చెప్పారు. పార్టీలో ఉన్నపుడు ఆయన ఎంపీ లాడ్స్ నిధులు ఇచ్చారని పోచారం గుర్తు చేసుకున్నారు. వెంకటేశ్వరస్వామి ఆలయానికి రోడ్డు కోసం రూ.10 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ని వేడుకుంటున్నానని, ఆయన కుటుంబసభ్యులను తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా హరికృష్ణ పార్థివదేహానికి ఎంపీ కవిత, నాగార్జున, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, జగపతిబాబు, అశ్వనీదత్ నివాళులర్పించారు. అదేవిధంగా రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి హరికృష్ణ మృతదేహానికి నివాళులర్పించారు.
హరికృష్ణకు ప్రముఖుల ఘన నివాళి




