Monday, 2 November 2026

హెచ్‌సీఏ అసమర్ధత వల్లే మ్యాచ్‌ రద్దు

– అజహర్‌ ఫైర్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌ 14,(జనంసాక్షి): శుక్రవారం ఉప్పల్‌లో జరగాల్సిన భారత్‌-ఆస్టేల్రియా 20-20 నిర్ణయాత్మక మ్యాచ్‌ రద్దుకావటంతో ఇప్పటికే హెచ్‌సీఏపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. హెచ్‌సీఏకు కావాలంటే ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానాన్ని కప్పిం ఉంచే కవర్లను అందజేస్తాం, బీసీసీఐ ప్రతినిధులు దయచేసి అలాంటి కవర్లను హైదరాబాద్‌ స్టేడియం నిర్వాహకులకు కొనిపెట్టండి అంటూ సోషల్‌ విూడియాలో మండిపడుతున్నారు.. ఇదిలాఉంటే మరోపక్క హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం(హెచ్‌సీఏ)పై మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ అజారుద్దీన్‌ కూడా విరుచుకుపడ్డారు. మ్యాచ్‌ రద్దయిన తీరు పట్ల అజహర్‌ అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్‌ నిర్వహణలో హెచ్‌సీఏ అసమర్థంగా వ్యవహరించిందని మాజీ కెప్టెన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ మ్యాచ్‌ను నిర్వహిస్తున్న హెచ్‌సీఏ.. ప్రొఫెషనల్‌గా వ్యవహరించలేకపోయిందన్నారు. వర్షం పడినా.. గువాహటిలో రెండవ టీ20 నిర్వహించారు, కానీ హైదరాబాద్‌లో మ్యాచ్‌ను నిర్వహించకపోవడం దారుణమని ఆయన విమర్శించారు. ఇది హెచ్‌సీఏకు సిగ్గుచేటు అని అజహర్‌ అన్నారు. మ్యాచ్‌ నిర్వహణలో హెచ్‌సీఏ వ్యవహారశైలి ప్రొఫెషనల్‌గా లేదని, ఉప్పల్‌లో వర్షం లేకున్నా.. మ్యాచ్‌ను నిర్వహించలేకపోవడం శోచనీయమన్నారు. గత రెండు వారాలుగా నగరంలో వర్షం పడుతున్నదని, అలాంటి సందర్భంలో దానికి కావాల్సిన జాగ్రత్తలు హెచ్‌సీఏ తీసుకుంటే బాగుండేదని అజహర్‌ అన్నారు. మరిన్ని కవర్లు తెచ్చి.. గ్రౌండ్‌ మొత్తం కప్పివేస్తే.. ఈ పరిస్థితి వచ్చేదికాదన్నారు. ఔట్‌ఫీల్డ్‌ను కప్పేందుకు సరిపడా కవర్లు లేకపోవడం వల్ల.. దురదృష్టవశాత్తు మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చిందన్నారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ మ్యాచ్‌లను కేటాయించాలంటే.. ఇక భవిష్యత్తులో బీసీసీఐ మరింత ఆలోచించాల్సి ఉంటుందని అజహర్‌ అన్నారు. హెచ్‌సీఏ వైఖరి వల్ల భారీ సంఖ్యలో ఉప్పల్‌కు వచ్చిన క్రికెట్‌ అభిమానులకు నిరాశే మిగిలిందన్నారు.