– విభజనతోనే ఇరు రాష్ట్రాల వికాసం
– టీయూడబ్ల్యూజే మీట్ ది ప్రెస్‌లో మంత్రి కేటీఆర్
హైదరాబాద్,జనవరి12(జనంసాక్షి): హైదరాబాద్ మహానగర అభివృద్ధిపై టీఆర్ఎస్ ప్రభుత్వానికి స్పష్టతతో పాటు అవగాహన కూడా ఉందని ఐటి శాఖమంత్రి కేటీఆర్ తెలిపారు. నగరాభివృద్దికి పక్కా ప్రణాళికతో ఉన్నామని అన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని అన్నారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీయూడబ్ల్యూజే నిర్వహించిన విూట్ ది ప్రెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ఈ తరానికి మూసీ అంటే ఒక డ్రైనేజీగానే తెలుసునని, దీనిని మురికి కూపంగా మార్చిన ఘనత గత పాలకులదన్నారు. అలాగే సుందరమైన హుస్సేన్ సాగర్నుకూడా మురికి కూపంగా మార్చారని అన్నారు. హైదరాబాద్ అభివృద్దితో పాటు ఇక్కడ నివసించే అన్నివర్గాలకు అండగా రక్షణగా ఉంటామన్నారు. ఇక ప్రధానంగా హైదరాబాద్‌లో పవర్ హాలిడేలు, కరెంట్ కోతలు లేకుండా చేశామని అన్నారు. గతంలో వారానికి రెండుసార్లు పవర్ హాలిడే ఇస్తే పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు చేసేవారని అన్నారు. మహానగర తాగునీటి విషయంలో ఒక స్పష్టతతో ఉన్నామని, దీనిని అధిగమించేందుకు కృష్ణాతో పాటు గోదావరి జలాలను కూడా నగరానికి తరలిస్తున్నామని అన్నారు. విభిన్న సంస్కృతుల సమ్మేళనం హైదరాబాద్‌లో కనిపిస్తుందని, హైదరాబాద్ ఒక మినీ ఇండియా అని కెటిఆర్ అభివర్ణించారు. 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్పై విషప్రచారం చేసారని, హైదరాబాద్‌లో సెటిలర్లకు రక్షణ ఉండదని దుష్ప్రచారం చేసినా వారు లబ్దిపొందలేదన్నారు. ఇది స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ ఆనాడే చెప్పామని అన్నారు. 18 నెలల కాలంలో ఎక్కడైనా ప్రాంతీయ వివక్ష కనబడిందా అంటూ ప్రశ్నించారు. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలంతా కలిసేవుంటాం అని చెప్పాం. విడిపోతేనే అభివృద్ధి సాధ్యమని ఆనాడే చెప్పాం. విభజనతోనే వికాసం అన్నమాట నిజమైందా కాలేదా?. మేం చెప్పిన ప్రతీ మాట అక్షర సత్యమైందన్నారు. మొదటి 9 నెలలు ఎన్నో బాలారిష్ట్రాలు ఎదుర్కొన్నాం. పాలనలో ఇప్పుడు వేగంగా దూసుకుని పోతున్నామని అన్నారు. గతంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఫ్లైఓవర్లు కట్టారు. రెండు కార్లు ఆగిపోతే ట్రాఫిక్ నిలిచిపోతుంది. మా ప్రభుత్వం ట్రాఫిక్ విషయంలో ఒక విజన్‌తో ముందుకు పోతుందని మంత్రి వెల్లడించారు. ఐదు జిల్లాలకు హైదరాబాద్ మహానగరం విస్తరించింది. తెలంగాణలో మూడోవంతు జనాభా హైదరాబాద్‌లో ఉంది. గత పాలకులు హైదరాబాద్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయలేదు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా గత ప్రభుత్వాలు కనీస కల్పించలేదని ఆయన పేర్కొన్నారు. స్వాంతంత్య్రం వచ్చేనాటికే హైదరాబాద్ అభివృద్ధి చెందిన నగరమని అన్నారు. నగరంలో 30కి పైగా రక్షణరంగ సంస్థలున్నయని,నాటి నుంచి నేటి వరకు ప్రధాన ఆర్థిక వనరుగా నిలిచిందని అన్నారు. హైదరాబాద్‌ను ఎవరూ ప్రపంచపటంలో పెట్టలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనతోనే ఆంధ్రాలో అభివృద్ధికి అంకురార్పణ జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పలు విషయాలపై మాట్లాడుతూ.. రాష్ట్రం విడిపోకపోతే గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చేదా? రాష్ట్రం విడిపోకపోతే అమరావతిలాంటి పట్టణానికి అంకురార్పణ జరిగేదా? 14 ఏళ్ల కిందట తెలంగాణ సిద్ధిస్తుందంటే నవ్వారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. సిటీకి 11 వైపులా ఆకాశమార్గాల నిర్మాణం చేపట్టి ట్రాఫిక్ సమస్యకు పరిస్కారం చూపబోతున్నారని అన్నారు. గత పాలకులు 50 ఏళ్లలో చేయని అభివృద్ధిని మేం ఐదేళ్ల చేసి చూపిస్తామని చెప్పారు. ఉపాధి కల్పన, నిరుద్యోగ యువతకు భరోసా కల్పించాం. గ్రేటర్ పరిధిలో రూ. 600 కోట్ల నల్లా, కరెంట్ బిల్లులను మాఫీ చేశాం. 2017 నాటికి మెట్రోరైలు నిర్మాణం పూర్తవుతుందని తెలిపిన మంత్రి పాతబస్తీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తమని వెల్లడించారు. అదేవిధంగా ఐటీ రంగంలో స్థానిక యువతకు రిజర్వేషన్ కల్పనపై ఆయన స్పందిస్తూ.. ఏ నగరంలో కూడా ఐటీ రంగంలో రిజర్వేషన్ సాధ్యం కాదన్నారు. ప్రైవేట్ రంగంలో నైపుణ్యం గల వ్యక్తులను మాత్రమే మాత్రమే తీసుకుంటారు. పెద్దపెద్ద సంస్థలన్నీ హైదరాబాద్‌లో క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. టాస్క్ పేరుతో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ అవకాశాలను అందుకునేలా చేస్తున్నాం. టీ హబ్ ద్వారా ఆవిష్కరణలకు రూపమిస్తున్నాం. ఉద్యోగ స్వీకర్తలే కాదు..ఉద్యోగ సృష్టికర్తలు కూడా కావాలి. వందలో పది కంపెనీలు క్లిక్ అయినా వేలాది ఉద్యోగాలు వస్తాయి. ఐటీ రంగంలో సంకుచింతంగా వ్యవహరించొద్దు. వరంగల్‌కి కొన్ని ఐటీ సంస్థలు రాబోతున్నాయి. ఎక్కడి వనరులు అక్కడే సద్వినియోగం కావాలనే ఉద్దేశ్యంతో ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుందని మంత్రి పేర్కొన్నారు ప్రజాస్వామ్యంలో విూడియా పాత్ర అత్యంత కీలకమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో విూడియా క్రియాశీలకంగా పనిచేస్తోందన్నారు.





