కళాభారతి స్టేడియంలో ఆవిష్కరించిన జనసేనాని పవన్ కళ్యాణ్
హైదరాబాద్,మే10(జనం సాక్షి): ‘వెబ్రెన్ట్స్ ఆఫ్ కలామ్’ సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ కళాభారతిలో అతి పెద్ద జాతీయ జెండా ప్రదర్శన జరిగింది. ఈ జాతీయ జెండాను జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… దేశం కోసం పనిచేసినవారికి జాతీయ జెండా సొంతం అని, మనమంతా పిడికిలి పట్టి జెండా ఎత్తి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. కాషాయం అంటే కల్మషం లేని మనసుతో స్వచ్ఛంగా ఉండటం అన్నారు. కాగా… దేశ సమగ్రత కాపాడాలని యువతతో పవన్‌కల్యాణ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భహంగా ప్రపంచంలోనే అతిపెద్ద జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో జెండా ఆవిష్కరణ వేడుకను నిర్వహించారు. 1857 మే 10న తొలి స్వాతంత్ర పోరాటాన్ని స్మరించుకుంటూ ఈ అతిపెద్ద జెండాను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.
ఆ కార్యక్రమానికి పవన్ వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో స్టేడియానికి చేరుకున్నారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి వారిని అదుపుచేశారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై పవన్ మాట్లాడుతూ..’దేశంలోనే అతి పొడవైన జాతీయ జెండాను ఆవిష్కరించడానికి నన్ను పిలిచినందుకు పేరుపేరునా నా నమస్కారాలు. ఈ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు, అశోక చక్రం.. ఇవన్నీ మన జాతి సమగ్రతకి, జాతీయ సమైక్యతకు నిదర్శనం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పినట్లు మన జాతీయ జెండా ఏ కులానిదీ, పార్టీది, మతానిది కాదు. ప్రతి ఒక్కరిదీ.’ అన్నారు. అనంతరం అక్కడికి వచ్చిన అభిమానుల చేత ప్రతిజ్ఞ చేయిస్తూ..’భారతీయుడినైన నేను.. భారతదేశ పౌరుడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను. నా దేశ వారసత్వ సంపదను పరిరక్షిస్తూ.. ప్రకృతికి నష్టం కలిగించకుండా పర్యావరణాన్ని కాపాడుతూ.. అనునిత్యం దేశ ప్రజలకై తపిస్తూ..దేశ ప్రయోజనాలే ప్రథమ చట్టాలుగా భావిస్తూ.. ఎటువంటి కుల,మత, ప్రాంత, వర్గ విభేదాలకు తావులేకుండా దేశ ప్రయోజనాలే పరమావిధిగా పాటిస్తానని మన జెండా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అన్నారు.
హైదరాబాద్‌లో అతిపెద్ద జాతీయ జెండా ఆవిష్కరణ




