ప్రాజెక్టులపై జిఎస్టీ భారాన్ని చర్చిస్తామన్న ఈటెల
హైదరాబాద్,సెప్టెంబర్8(జనంసాక్షి): హైదరాబాద్‌లో తొలిసారి జీఎస్టీ మండలి సమావేశం శనివారం
జరగనుంది. దీనికి ఆర్థికమంత్రి జైట్లీ హాజరవుతున్నారు. హైదరాబాద్‌లో జరగబోయేది 21 వ మండలి సమావేశం. ఉదయం 11 గంటల నుంచి 5 గంటల వరకు సమావేశం జరుగనుందని, ఈ సందర్భంగా ఏర్పాట్లను సవిూక్షించిన మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జిఎస్టీ నష్టాలపై మండలి సమావేశంలో మరోమారు చర్చిస్తామని ఈటెల అన్నారు. అనేక ప్రాజెక్టులకు ఇది గుదిబండగా మారిన విసయాలను చర్చిస్తామని అన్నారు. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ పనులపై జీఎస్టీ రద్దు చేయాలని, లేని పక్షంలో 5 శాతం శ్లాబ్ లో పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి చెప్పారు. అన్ని రాష్టాల్రు కూడా జీఎస్టీని సవరించాలని కోరుతున్నాయన్నారు. దీనిపై ప్రతిపాదన పెడతామని.. ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు, వాటిపై భారానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించామని.. వాటిని మండలికి అందజేస్తామన్నారు. జీఎస్టీ వల్ల ఆన్ గోయింగ్ ప్రాజెక్టులపై రూ. 9 వేల కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగకుండా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. గత సమావేశ నిర్ణయాల అమలు సహా ఇతర అంశాలపై చర్చిస్తామని ఆయన ఈ సందర్భంగా వివరించారు.
అతిధులకు ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామన్నారు. ఉన్నతాధికారులతో అన్ని అంశాలపై సవిూక్షించామన్నారు. ఇప్పటికే కొంత మంది మంత్రులు, అధికారులు హైదరాబాద్ కు చేరుకున్నారని మంత్రి చెప్పారు. సమావేశం ఏర్పాట్ల బాధ్యతలను హరీశ్ రావు, కడియం శ్రీహరి, తాను చూస్తున్నట్లు చెప్పారు. ఇక్కడి వ్యాపార వర్గాల వినతులను జైట్లీ వింటారని ఆయన అన్నారు. సీఎం తరుపున రాత్రి ఫలక్ నుమా ప్యాలెస్ లో విందు ఉంటుందని ఆయన తెలియజేశారు.
—-




