Monday, 2 November 2026

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి

C

– స్వాగతం పలికిన గవర్నర్‌ నరసింహన్‌, సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,జూన్‌29(జనంసాక్షి):

వర్షాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. నగరం శివారులోని హకీంపేట ఎయిర్‌పోర్టుకు 2గంటలకు ప్రణబ్‌ ప్రత్యేక  విమానంలో చేరుకున్నారు. ఆయనకు గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఉపముఖ్యమంత్రి మహ్మద్‌ అలీ, మంత్రులు స్వాగతం పలికారు. జులై 8వ తేదీవరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేయనున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలోహైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారి సహా పలువురు నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు.ఇక్కడ ఆసక్తికరమైన విశేషం  ఏమిటంటే సహజంగా  చేసే అభివాదానికి భిన్నంగా కెసిఆర్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ కు పుష్పగుచ్చం ఇచ్చాక, పాదాభివందనం చేసి  కెసిఆర్‌ ఆశీర్వాదం తీసుకున్నారు. గతంలో కూడా ఒకసారి ఇలాగే సిఎం ఆశీర్వాదం తీసుకున్నారు. రాష్ట్రపతి కూడా ఆయనకు ఆప్యాయంగా ఆశీర్వాదం ఇచ్చారు.ఆ తర్వాత కూడా కెసిఆర్‌ ముకుళిత హస్తంతో కూడా నమస్కారం చేశారు.కెసిఆర్‌ పెద్దవారికి ఇచ్చే మర్యాద అపురూపంగానే ఉంటుందనడానికి రాష్ట్రపతి విసయంలో గమనించవచ్చు. అనంతరం రాష్ట్రపతి నేరుగా బొల్లారం అతిథి గృహానికి చేరుకున్నారు. ఆయన 1న తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. 3న యాదాద్రిలో హరితహారం కార్యక్రమంలో పాల్గొంటారు. 3న జరిగే హరితహారం ప్రారంభోత్సవం, ఇతర కార్యక్రమాలకు రావాలని సీఎం ఈ సందర్భంగా రాష్ట్రపతిని ఆహ్వానించనున్నారు. బుధవారం రాష్ట్రపతి తిరుమల వెళ్తారు. వచ్చేనెల 3న మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు రచించిన ‘ఉనికి’ పుస్తకాన్ని ఆయన హైదరాబాద్‌లో ఆవిష్కరిస్తారు. జులై 6న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘నక్షత్ర వాటిక’ను ప్రణబ్‌ ప్రారంభిస్తారు. ఇంకా మరికొన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. రాష్ట్రపతి రాకపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి సైతం సమాచారం పంపించారు. ప్రణబ్‌ రాకతో రహదారికి ఇరువైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీసు అధికారులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. నిలయం పరిసరాల కాలనీల్లో, రహదారులపై ఆంక్షలు విధించారు. కూడళ్లలో, నిలయానికి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులు ఉంటేనే ఆ మార్గం విూదుగా వెళ్లేందుకు అనుమతిస్తున్నారు. ఇక  రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వచ్చే నెల 1న తిరుమలకు రానున్నారు. ఆ పర్యటన ఏర్పాట్లను టిటిడితో పాటు చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. ఇప్పటివరకు అధికారిక నిర్ణయం మేరకు రాష్ట్రపతి ముందుగా తిరుచానూరుకు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం తిరుమలకు చేరుకుని మొదటగా శ్రీవరాహస్వామివారిని దర్శించుకుని శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. ఇదిలావుంటే తెలంగాణలో రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగుతోందా అని కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌ ప్రశ్నించారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన వివరాలు విపక్షాలకు చెప్పనవసరం లేదా అని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు వ్యవహారంలో కేంద్రం తీరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. సెక్షన్‌-8, ఓటుకు నోటు విషయాలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పొంగులేటి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *