Friday, 6 November 2026

హైదరాబాద్‌ చేరుకున్న సిద్దరామయ్య

ఎమ్మెల్యేలతో బలపరీక్ష వ్యూహంపై చర్చ
తమ ఎమ్మెల్యేను బిజెపి కిడ్నాప్‌ చేసిందని బెంగుళూరులో ఆరోపణ
హైదరాబాద్‌,మే18(జ‌నం సాక్షి ):  కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య తాజ్‌కృష్ణ ¬టల్‌కు చేరుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సిద్ధరామయ్య.. అటు నుంచి నేరుగా కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలు బస చేస్తున్న తాజ్‌కృష్ణ ¬టల్‌కు బయల్దేరారు. ఆయనవెంట కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ కూడా ఉన్నారు.  కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలతో వీరుసమావేశమై.. బలపరీక్షపై దిశానిర్దేశం చేయనున్నారు.  శనివారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప తన బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడే వ్యూహం అమలు చేయబోతున్నారు. గురువారం రాత్రి 12.15 గంటలకు కాంగ్రెస్‌, జేడీఎస్‌కు చెందిన మొత్తం 116 మంది ఎమ్మెల్యేలు రోడ్డుమార్గం ద్వారా రహస్యంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు. కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌కు ఎనిమిది దూరంలో ఉంది. అయినప్పటికీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీని గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. గవర్నర్‌ చర్యను నిరసిస్తూ కాంగ్రెస్‌, జేడీఎస్‌లు ఆందోళన బాట పట్టాయి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు బేరసారాలు జరుపుతున్నారన్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రత్యేక శిబిరాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగానే కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు. దీంతో వ్యూహం అమలుపై చర్చించాక ఈ రాత్రికి గానీ లేదా తెల్లవారు జామున వీరంతా బెంగుళూరు చేరుకోనున్నారు. ఇదిలావుంటే అంతకు ముందు బెంగుళూరులో సిద్దరామయ్య మాట్లాడుతూ తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను బిజెపి కిడ్నాప్‌ చేసిందని ఆరోపించారు.
సుప్రీం కోర్టు బల పరీక్షకు ఆదేశించిన నేపథ్యంలో  సిద్ధరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఆనంద్‌ సింగ్‌ను బీజేపీ కనిపించకుండా చేసిందని ఆయన ఆరోపించారు. ఈడీ, ఇన్‌కంట్యాక్స్‌ శాఖల సహకారంతో ఎమ్మెల్యేను భయపెట్టిందని సిద్ధరామయ్య ఆరోపణ చేశారు. హార్స్‌ ట్రేడింగ్‌ చేస్తున్నది ఎవరో ఇప్పుడు చెప్పాలని ఆయన బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆనంద్‌ సింగ్‌ను ఎవరు కిడ్నాప్‌ చేశారని సిద్దరామయ్య ప్రశ్నించారు. బీజేపీ సిగ్గులేకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. రాజ్యాంగమన్నా, ప్రజాస్వామ్యమన్నా మోదీకి, అమిత్‌ షాకు గౌరవం లేదన్నారు.