ఆదాయం సమకూరేలా అభివృద్ది చేసా
పాలించడం చేతకాక కెసిఆర్ విమర్శలు
ప్రకాశం జిల్లా సభలో చంద్రబాబు మండిపాటు
ఒంగోలు,అక్టోబర్2(జనంసాక్షి): హైదరాబాద్‌ను అభివృద్ది చేసి అప్పగిస్తే పాలన చేతగాక కెసిఆర్ తనపై విమర్శలు చేస్తున్నారని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. హైదరాబాద్‌కు తానెంతగా కష్టపడ్డానో ప్రంపచానికి తెలుసన్నారు. ఆదాయం సమకూర్చేలా అభివృద్ది చేశానని అన్నారు. హైదరాబాద్ తన కష్టార్జితమని చెప్పారు. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం డేగరమూడి గ్రామదర్శినిలో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. తనపైన కెసిఆర్ ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. హైదరాబాద్ అభివృద్ది కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగానన్నారు. సైబరాబాద్‌ను నిర్మించి పెట్టామన్నారు. ఇకపోతే విభజన హావిూలను నెరవేర్చమంటే కేంద్రం దాడులకు దిగుతోందని ధ్వజమెత్తారు.
టీడీపీ నేతల ఇళ్లల్లో ఐటీ సోదాలు చేయిస్తున్నారని ఆరోపించారు. అయితే తానెవరికీ భయపడనని’ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేను బయటకు రాననుకున్నారు.. కానీ తిరగబడ్డానని’ కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. జాతీయస్థాయిలో అందరినీ కూడగడుతున్నానని తెలిపారు. ‘నేనెవరికీ భయపడను, కేంద్రం మెడలు వంచుతానని’ ప్రకటించారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రతిపక్షాలకు ఓటు అడిగే హక్కుందా? అని ప్రశ్నించారు. కులం, మతం చూసి ఓట్లు వేయొద్దని.. అభివృద్ధిని చూసి ఓటేయాలని చూపించారు. వచ్చే ఎన్నికల్లో ఏకపక్షంగా ఓటేసి టీడీపీని గెలిపించాలని ప్రజలను చంద్రబాబు కోరారు.
సమర్థవంతంగా ప్రమాద బీమా అమలుచేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేవరకు బాధ్యత తీసుకుంటానన్నారు. అగ్రవర్ణాల్లో పేదలకు కూడా ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. రెండున్నరేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు ఇస్తామని, జిల్లాలో వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. అన్ని విభాగాలను టెక్నాలజీతో అనుసంధానం చేశామని ఆయన వివరించారు. రియల్‌టైమ్ గవర్నెన్స్‌తో అన్ని శాఖలను మానిటరింగ్ చేస్తున్నామని, పేదరికానికి కులం, మతం, పార్టీ అని లేదన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. పట్టిసీమ ద్వారా కృష్ణా పశ్చిమ డెల్టాకు నీళ్లు ఇచ్చాం. గోదావరి నీళ్లు నాగార్జున సాగర్‌కు తీసుకొస్తాం. వ్యవసాయంలో మెరుగైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. రామాయపట్నం పోర్టు ద్వారా జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి. జిల్లాలో టంగుటూరి ప్రకాశంపేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. వెలుగొండ ప్రాజెక్ట్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేయడం నా చిరకాల స్వప్నం. ఫిబ్రవరి చివరి నాటికి మొదటి టన్నెల్ పనులు పూర్తిచేస్తాం. 6, 7 ప్యాకేజీ పనులు పూర్తి చేసి నీరందిస్తాం. నిర్మాణపనుల్లో జాప్యం చేస్తే ఆయా కంపెనీలను బ్లాక్ లిస్టులో పెడతాం. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తాం. ప్రకాశం జిల్లాలో పేపర్ మిల్లు ఏర్పాటుపై త్వరలో అధికారిక ప్రకటన చేస్తాం. గత ప్రభుత్వాల తప్పిదాల వల్లే వాన్‌పిక్ ఆగిపోయింది అని చంద్రబాబు చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు మాట్లాడారు.




