హైదరాబాద్,నవంబర్30(జనంసాక్షి): రెండు రోజుల హైదరాబాద్ పర్యటన అద్భుతంగా ఉందని అగ్రరాజ్య
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ ఓ ఆసక్తికరమయిన ట్వీట్ చేశారు. ప్రధానంగా తన గోల్కొండ కోట సందర్శన మరువలేనిదని పేర్కొన్నారు. ఆమె తన పర్యటనను ముగించుకుని బుధవారం రాత్రి అమెరికాకు వెళ్లిన తరవాత హైదరాబాద్‌లో రెండు రోజుల పర్యటన గురించి ప్రస్తావిస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘హైదరాబాద్‌ను నుంచి వచ్చే ముందు గోల్కొండ కోటకు వెళ్లాను. కొంతమంది అమెరికా ప్రతినిధులతో కలిసి కోటలో పర్యటించా. హైదరాబాద్ పర్యటనకు పరిపూర్ణమైన ముగింపు ఇదేనని గోల్కొండ కోటను చూశాక అనిపించింది’ అని ఇవాంకా ట్రంప్ తన ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. గోల్కొండ కోటను చూసి ఇవాంకా చాలా థ్రిల్‌కు ఫీలయ్యారట. కోట ప్రాసశ్యాన్ని అడిగి మరీ తెలుసుకున్నారు. శతాబ్దాల క్రితం కోటలో వెల్లివిరిసిన రాజవైభవాన్ని వివరిస్తుంటే అమితాసక్తితో విన్నారు. కోటలో ఆయుధగారం, రాణీమహల్ ప్రాంగణం, అక్కన్న, మాదన్న కార్యాలయాలను ఆమె సందర్శించారు. అలసటన్నది లేకుండా నడుచుకుంటూనే అక్కడ వివిధ ప్రదేశాలను చూస్తూ దాదాపు యాభై నిమిషాలు గడిపారు. కాగా గోల్కొండ లాంటి పురాతన కట్టడాలు తమ దేశంలో లేవని, ఇలాంటి చారిత్రక కోటలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఇవాంకా అన్నారు. ఆమె వెంట అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా, అమెరికా రాయబారి కెన్నిత్ జస్టర్ ఉన్నారు.
హైదరాబాద్ పర్యటన అద్భుతం: ఇవాంకా ట్వీట్




